ఆకలితోనైనా చస్తా ఆత్మాభిమానం వదులుకోను!
‘ఎక్సైజ్ శాఖలో 30 ఏండ్లుగా మచ్చలేని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించా. చేయని తప్పునకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నన్ను తీవ్రంగా అవమానించారు. నా జీవితంలో ఎన్నడూ ఎదురోని ఘోర అవమానం పాల్జేశారు.
- ఎక్సైజ్ కమిషనర్ నన్ను ఘోరంగా అవమానించారు
- ‘ఇడియట్, యూజ్లెస్ ఫెలో’ అన్న మాటలు
- నా మనసుకు శూలాల్లా గుచ్చుకొని గాయంజేశాయి
- సహచరుల ముందే అవమానాన్ని భరించలేకపోయా
- అంత అవమానం జరిగాక ఆ శాఖలో కొనసాగలేను
- గుండెనిండా బాధతో ఉద్యోగాన్ని వదులుకొంటున్నా
- నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి
- ‘నమస్తే తెలంగాణ’ కథనం చదివి భావోద్వేగం
- ఎక్సైజ్ శాఖ కమిషనర్ అవమానంపై దవాఖాన నుంచే వీడియో, లేఖ రూపంలో బహిర్గతం
హైదరాబాద్, ఏప్రిల్ 11( నమస్తే తెలంగాణ): ‘ఎక్సైజ్ శాఖలో 30 ఏండ్లుగా మచ్చలేని అధికారిగా బాధ్యతలు నిర్వర్తించా. చేయని తప్పునకు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ నన్ను తీవ్రంగా అవమానించారు. నా జీవితంలో ఎన్నడూ ఎదురోని ఘోర అవమానం పాల్జేశారు. నన్ను ఇడియట్, వెధవ, పండబెట్టి తొక్కుత.. అంటూ ఆయన దూషించిన మాటలు నా మనసుకు శూలాల్లా గుచ్చుకొన్నాయి. నా మనసుకు గాయమైంది. చైతన్యం చచ్చిపోయిన శాఖలో ఇన్ని ఏండ్లు పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇక నేను ఇకడ ఇమడలేనని పూర్తిగా అర్థమైంది. గుండెల నిండా బాధతో నా ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. ఆకలితోనైనా చస్తాం.. కానీ, ఆత్మాభిమానం వదులుకోలేను’ అని ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన అవమానం భరించలేక కార్యాలయంలోనే సోమిరెడ్డి కుప్పకూలారు. ఆ ఘటనను వెలుగులోకి తీసుకొస్తూ..‘ఇడియట్..పండబెట్టి తొక్కుత’ అనే శీర్షికతో శనివారం ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కమిషనర్ తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు కన్నెర్ర జేశారు. ‘నమస్తే’ కథనాన్ని చదివి తీవ్ర ఉద్వేగానికి లోనైన సోమిరెడ్డి గురువారం అర్ధరాత్రి నాటి ఘటనను మీడియాకు బహిర్గతం చేశారు. ఈ మేరకు ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన తనకు జరిగిన ఘోర అవమానాన్ని శనివారం ఉదయం దవాఖాన నుంచే లేఖ ద్వారా బహిర్గతం చేశారు. వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోమిరెడ్డి రాసిన లేఖ సారాంశం కింది విధంగా ఉన్నది.
మిత్రులకు, ఎక్సైజ్ శాఖ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు!
ప్రస్తుతం నా ఆరోగ్యం మంచిగానే ఉన్నది. నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడలేడని చాలాసార్లు అనిపించింది. కానీ నా మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఇంతకాలం నెట్టుకొచ్చాను. వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక ఇప్పడు నేను ఇమడలేనని పూర్తిగా అర్థమైంది. చేయని తప్పుకు వెధవ, ఇడియట్ అన్నప్పుడు నా మనసుకు గాయమైంది. నేను ఒకటే మాట ఎదురు చెప్పా. ‘అలాంటి మాట వద్దు సార్’ అని మాత్రమే అన్నా.. ఆ చిన్న మాటకు కమిషనర్ గారి ఈగో హర్ట్ అయిందనుకుంటా! ఎవరూ, ఎన్నడూ ఎదురు చెప్పి ఉండరు కదా! ‘10 నిమిషాలకు పైగా నన్ను నువ్వు వెధవాతి వెధవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి కూడా చదివారు. నా జీవితంలో ఎన్నడూ ఎదురోని అవమానకరమైన మాటలన్నారు. నాతోనే నేను వెధవను అనిపించుకునేలా ప్రయత్నం చేసారు. ఆ సమయంలో అదే గదిలో నాతోపాటు నలుగురు అధికారులు, సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపతర పరిస్థితి నన్ను చాలా మానసిక వ్యథకు గురిచేసింది. అయినా తట్టుకున్నాను.
అరేయ్, ఓరేయ్, వెధవ, ఇడియట్..
బయటకు వచ్చి నాకు జరిగిన అవమానాన్ని నా సహచర మిత్రులకు, అధికారులకు చెప్పాను. అటువంటి మాటలు మనల్ని అలా ఎలా అంటాడని అందరికీ చెప్పాను. కమిషనర్ను ప్రశ్నిద్దాం అని అడిగాను. కానీ నా సహచరులెవరూ నోరు విప్పలేదు. కమిషనర్ అవమానించిన దాని కన్నా కూడా అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అన్నప్పుడు ఆలోచనలో పడ్డ అధికారులు, మిత్రుల భయం, మౌనం.. నన్ను బాగా కలచివేసింది. అప్పుడే అకడే కుప్పకూలిపోయా. మిత్రులు దవాఖానకు చేర్చారని తర్వాత తెలిసింది. వారికి నా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. ‘అరేయ్, ఓరేయ్, వెదవ, ఇడియట్, యూజ్లెస్ ఫెలో.. ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా, దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న ఇతర అధికారులకు, నాతోటి మిత్రులకు నా నమసారం!
ఆత్మాభిమానంతో బతకడమే జీవితమని నమ్మా..
‘నేను పెరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బతకడమే జీవితం అని నమ్మాను. ‘ఆకలితోనైనా చస్తాం.. కానీ ఆత్మాభిమానం వదులుకోలేం’ అన్న కాళోజి మాటల యాదితో స్ఫూర్తి నింపుకొన్న. చేతకాని, చావలేని, చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 సంవత్సరాలు పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. నా కుటుంబ సభ్యులతో చర్చించాను. ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి ఆ శాఖను (ఉద్యోగం) వీడి వెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నా. ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన, నాకు సహకరించిన ఉన్నాతాధికారులకు, మిత్రులకు, సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ పోస్టు ఎంతో మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నా’ అంటూ సోమిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

