e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home Top Slides 33 అంతస్తులతో అద్భుత దవాఖాన

33 అంతస్తులతో అద్భుత దవాఖాన

33 అంతస్తులతో అద్భుత దవాఖాన
  • కెనడాను తలదన్నేలా సదుపాయాల కల్పన
  • అన్ని వైద్యసేవలూ అందుబాటులో ఉండాలి
  • పరిశ్రమలు, విద్య, వైద్యకేంద్రంగా వరంగల్‌

వరంగల్‌, జూన్‌ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమైన, అద్భుతమైన దవాఖానను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. సోమవారం వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానకు భూమి పూజ, సమీకృత కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం మాట్లాడుతూ.. వరంగల్‌ పరిశ్రమలకేంద్రం, గొప్ప విద్యాకేంద్రం, గొప్ప వైద్య కేం ద్రం కావాలి. తూర్పు తెలంగాణకు వరంగల్‌ ప్రధాన కేంద్రం కావాలి. వరంగల్‌లో అత్యాధునిక పెద్ద హాస్పిటల్‌ నిర్మాణంకోసం భూమిపూజ చేసుకొన్నం. హాస్పిటల్‌ వ్యవస్థలో కెనడా ముందంజలో ఉంటుంది. గవర్నర్‌, గవర్నర్‌ భర్త అక్కడ చదువుకొన్న అనుభవంతో ఇదేచెప్పారు. వరంగల్‌లో కట్టుకొనే హాస్పిటల్‌ కెనడా కంటే గొప్పగా ఉండాలి. ప్రపంచంలో ఉండే అన్ని వైద్య సేవల విభాగాలు ఈ హాస్పిటల్‌లో ఉండాలి. నాకు గవర్నర్‌గారు ఏం చెప్పిన్రంటే.. కెనడా దేశం వాళ్లకు ఎయిర్‌ అంబులెన్సులున్నయి. పేషెంట్‌కు ఏమన్న అయితే అర్జంట్‌గా పోతరు.. లిఫ్ట్‌ చేస్తరు.. తీసుకొస్తరు. ప్రాణం కాపాడతరు. ఇందుకోసం హాస్పిటల్‌ టాప్‌మీద హెలిపాడ్‌ పెట్టుకొన్నరు. ఐసీ యూ వంటి క్రిటికల్‌కేర్‌ యూనిట్లన్నింటినీ టాప్‌ ఫ్లోర్లలో పెట్టుకొన్నరు. బిల్డింగ్‌ ఒక్కటిగానే ఉండాలె. కానీ విభాగాలు.. ఏ విభాగానికంటే.. ఆ విభాగానికే పోవాలె. టర్నవుట్‌ అలా ఉండాలి. ఆంకాలజీ విభాగానికి ఎంట్రన్స్‌ సపరేటు.. దాని లాబీ సపరేటు.. దాని లిఫ్ట్‌ సపరేటు.. అట్ల ఉండాలి. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ.. ఇంకేమేం జీలు ఉంటయో మాకు తెల్వది. తెలిసినకాడికి చెప్తున్న.

33 అంతస్తుల్లో భారీ నిర్మాణం
ఇది టాలెస్ట్‌ టవర్‌ ఫర్‌ వరంగల్‌ టౌన్‌. దీన్ని ఎన్ని అంతస్తులతో నిర్మించేందుకు అనుమతి ఉంటుందని విమానయాన, ఇతర శాఖలవారిని అడిగిన. ఇక్కడ ఇబ్బందులు ఏమీ లేవని ప్రధాన రోడ్డు విశాలంగా ఉంటే సరిపోతుందని చెప్పారు. వందఫీట్ల రోడ్డు ఉం టే చాలన్నరు. నా లెక్క అయితే 33 అంతస్తులు కట్టాలని అంటున్నా. వైద్యశాఖ కార్యదర్శి, వైద్య యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌, వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌, ఆర్‌అండ్‌బీ మినిస్టర్‌, ఈఎన్సీ ఆర్‌అండ్‌ బీతోపాటు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకొని తక్షణం కెనడా విజిట్‌చేసి రండి. అక్కడ వీడియోలు, ఫొటోలు తీసుకొని రండి. అక్కడి హాస్పిటల్స్‌ను తలదన్నేలా మనం కట్టుకుందాం. నిన్ననో మొన్ననో పేపర్ల చదివిన.. 28 గంటల్లో పదంతస్తుల బిల్డింగ్‌ కట్టిన్రు చైనాలో.. మరి మీ హాస్పిటల్‌ను ఎన్నిరోజుల్లో కడతరు? మీకు దయచేసి చెప్తున్న. అవసరమనుకొంటే చైనాకెల్లి పట్టుకరండ్రి. పది రూపాయలు ఖర్చయినా మంచిది. వాడు కట్టినోడు అంత గొప్పో డు అయితే వాణ్ణే పట్టుకురండి.. మనకు పని జల్దీ కావాలి. కాకపోతే పటిష్ఠంగా, మంచిగ, బందోబస్తుగ పని మంచిగ కావాలి. నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేస్తా. రెండుమూడు వేల కోట్లు అయినా సరే అనుకున్నట్లుగానే హాస్పిటల్‌ నిర్మించుకొందాం. చెప్పినట్లుచేస్తే జనం దండం పెడతరు. నేను చెప్తాను. చేయించే జిమ్మేదారి ఇక్కడి మంత్రి, ఎమ్మెల్యేలదే.

- Advertisement -

ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ కాంప్లెక్సు
వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌, కాకతీయ మెడికల్‌ కాలేజీ, కంటి దవాఖాన, సెంట్రల్‌ జైలు స్థలం కలిపి 200 ఎకరాల వరకు అవుతుంది. ఆ ప్రాంతాన్ని సమగ్ర ఆరోగ్య సముదాయం (ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ కాంప్లెక్సు)గా అభివృద్ధిచేయాలి. ఇప్పటికే వరంగల్‌లో హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేసుకొ న్నం. వరంగల్‌కు నిన్ననే వెటర్నరీ కాలేజీ మంజూరుచేసినం. నేను ఈ రోజే డెంటల్‌ కాలేజీ మంజూరు చేస్తాఉన్నా. దాంట్లో డెంటల్‌ కాలేజీ పెట్టండి. డెంటల్‌ హాస్పిటల్‌ కూడా పెట్టండి. పన్ను నొప్పోడు హైదరాబాద్‌కు రావొద్దు. అక్కడోళ్లే ఈడికి వచ్చేట్టుండాలె. ఎంజీఎం ఆవరణలో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మించుకుందాం. ఐ హాస్పిటల్‌కు 25 ఎకరాలున్న ది. దానికి అంతజాగ అవసరమా? రీజినల్‌ ఐ కేం ద్రం ఉండాలి. ఒకేసారి 1500 మంది మహిళలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడా కొత్త భవనం కట్టుకుందాం. హైదరాబాద్‌ వాళ్లు ఈర్ష్య పడేలా వరంగల్‌ అభివృద్ధి జరగాలి. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాలసేవలు ఇక్కడ అందుబాటులోకి రావాలి. విద్యా సంబంధమైనవి కూడా రావాలి. దానికోసమే ఎవరేమనుకున్నా సరే.. తిట్టినా సరేనని హెల్త్‌ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చి వరంగల్‌లోనే పెట్టిన. ఇక్కడ అద్భుతమైన రైల్వే జంక్షన్‌ వచ్చింది. అద్భుతమైన బైపాస్‌ రోడ్డు వచ్చింది. అద్భుతమైన ఫోర్‌లేన్‌ హైవేలు వచ్చినయి. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు కూడా రాబోతున్నది. ఇప్పుడు హైదరాబాద్‌ కన్న ఏం తక్కువున్నది? ఐటీ విస్తరణ జరగాలి. ఎక్సలెంట్‌ హెల్త్‌ ఫెసిలిటీ రావాలి. జైలు కూలగొడితె నాకేమన్న వచ్చేదున్నదా కిరీటం? దాన్ని కూడా కొంతమంది సన్నాసులు విమర్శిస్తున్నరు. అదెప్పుడో 135 ఏండ్ల కిందట కట్టిన్రు. ఆ జైల్లో ఉండేటోళ్లు ఎవరు.. ఖైదీలు. పొద్దున లేస్తే ఆడికెళ్లి పట్నంలోకి వచ్చేటోళ్లు లేరు. పట్నమోడు అళ్ల కొచ్చేది లేదు. ఆ జైలు ఐదు కిలోమీటర్ల అవతల ఉంటే నష్టమున్నదా? ఏమొస్తది? దాన్నికూడా వక్రీకరించి మాట్లాడేటోళ్లు ఉన్న రు. నిన్న నేను రెండు సభలల్ల చెప్పిన. మీరు కూడా చాలామంది ఇని ఉంటరు. వాళ్లెవరినీ ఖాతరు చేయకుండా ముందుకు పోతున్నం.

వైద్యులపై దాడులు సహించం
సర్కారు హాస్పిటల్‌కు పోతే జరమొస్తుందనేఒకరకమైన అభిప్రాయాన్ని పెంచారు. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, నిలోఫర్‌లో ఏ రోజు బెడ్లు ఖాళీగా ఉండవు. అంతా మంచిగ అయ్యి ఇంటికి పోతరు. అందరు మాత్రం సర్కారు హాస్పిటల్‌నే బదానం చేస్తరు. సర్కారుకు హాస్పిటల్‌కు వచ్చేది పేదలే. వారికి బెడ్లు లేకుంటే కింద పడుకోబెట్టి అయినా డాక్టర్లు వైద్యం చేస్తరు. ప్రభుత్వ డాక్టర్లకు నేను సెల్యూట్‌ చేస్తున్న. వారు ఎవరినీ వెనక్కి పంపరు. వైద్యరంగంపై, డాక్టర్లపై దాడులను సహించేది లేదు. కరోనా రెండోదశలో మన డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశలు బాగా పని చేసిండ్లు. కరోనా వ్యాప్తి నివారణ కోసం ఇంటింటి జ్వరం సర్వేచేద్దామని నేను సీఎస్‌తో చెప్పిన. ఎవరైనా ఇంకొకరి ఇంటికి వెళ్లాలంటే భయముండె అప్పుడు. అయినా మన ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వేచేశారు. దేశంలో ఎక్కడాచేయని విధంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ మెడికల్‌ కిట్లు ఇచ్చిండ్లు. కరోనాలో మన వైద్యశాఖ, పోలీసుశాఖ అద్భుతంగా పనిచేశాయి. సగం జిల్లాల్లో కరోనా సున్నా స్థాయికి వచ్చింది.

పీహెచ్‌సీ నిబంధనలు మార్చాం

నేను సీఎంగా డాక్టర్‌ సోదరులను పిలిచి మా ట్లాడిన. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మన పాత వరంగల్‌ జిల్లా ములుగులో, మహబూబాబాద్‌ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే రిమోట్‌ ఏరియాలో గిరిజన సోదరులున్నరో.. అటువంటి చోట్ల ఎవరు పనిచేయాల్నయ్యా.. మీరు పోకపోతే? చీఫ్‌ సెక్రటరీకి సూదిచ్చుడు రాదు. చీఫ్‌ మినిస్టర్‌కు రాదు. మంత్రికిరాదు. నీకు వస్తది. నువ్వు ప్రత్యేకించి ఆ శాస్త్రం చదువుకున్నవు కాబట్టి.. ప్రభుత్వం లక్షలు ఖర్చుపెట్టి చదివించింది కాబట్టి! అంటే.. వాళ్లు ఒక్కటే చెప్పిన్రు. ‘సార్‌ మేం పోవటానికి సిద్ధంగానే ఉన్నం కానీ మా భార్యలు వస్తలేరు. ఎందుకంటే.. మాకు పిల్లలున్నరు. అక్కడ చదివిపిస్తమంటే స్కూళ్లు లేవు. దవాఖానలు లేవు.. మేం పనిచేసే దవాఖానలు చక్కగ లేవు’ అని చెప్పిన్రు. అప్పుడు నేను అక్కడున్న రాజీవ్‌శర్మగారికి చెప్పి న. ఆ పీహెచ్‌సీల్లో వాళ్లు ఉండేది లేదు.. సచ్చేది లేదు. నువ్వుఆడ్నే ఉండాలె అన్న నిబంధన ఎం దుకు? పక్క పెద్దటౌన్లలో ఉండుకుంటూ వాళ్లు అక్కడ పనిచేసేటట్లు పెట్టుండ్రయ్యా.. అని చెప్పిన. వరంగల్‌లాంటి పట్టణంలో గొప్ప ఫెసిలిటీలు వచ్చినయి. ఇంకా హైదరాబాద్‌ కంటే నయమున్నది అని అనుకొనే పద్ధతి రావడానికి ప్రయత్నిస్తున్నం.

పాత తాలూకాలో మాతాశిశు కేంద్రం
మహిళలు ప్రసవిస్తేనే మనం పుట్టినం. కాబట్టి మాతాశిశు సంరక్షణ చాలా ముఖ్యమైన అంశం. మనం చిన్న ప్రయత్నం చే శాం. తెలంగాణ ఏర్పాటుసమయంలో తల్లు ల మరణాలు, శిశు మరణాలు చాలా ఎక్కు వ ఉండే. ఇప్పుడు చాలా తగ్గించినం. దేశంలో మనం మొదటి రెండుస్థానాల్లో ఉ న్నాం. ఇంతకుముందంటే ఏదో నడిచిపోయింది. ఇప్పుడు అభ్యుదయంగా ఉండే తెలంగాణ. అనాగరికంగా ఉండేందుకు వీల్లే దు. ప్రతి పాత తాలూకాకేంద్రాల్లో ఈ మా తా శిశు సంరక్షణ కేంద్రాలు ప్రత్యేకంగా రావాలి. ప్రసూతి కేంద్రాలు, గైనకాలజిస్టు లు.. ఇలా దానికి సంబంధించినవన్నీ రావా లి. అంటే ప్రతి పాత తాలూకాలో ఒక మినీ నిలోఫర్‌ దవాఖాన రావాలి. అది నా కల.

జయశంకర్‌ను తలుచుకుంటే బర్కత్‌ ఉంటది
జయశంకర్‌ సార్‌ లాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటరు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరాటపడ్డారు. మర్కజీ స్కూల్‌లో ఆయన చదివేటప్పుడు అప్పటి అయ్యదేవర కాళేశ్వరావు అనే ఆంధ్రానాయకుడు వచ్చినప్పుడు జై తెలంగాణ అని నినాదం చేసి లాఠీచార్జీలో గాయపడ్డారు. 1969 ఉద్యమం ఫెయిల్‌ అయ్యింది కదా అప్పటి నుంచి ఏం చేశారు? అని అడిగిన. పెద్ద నాయకులు వెళ్లిపోయిండ్లు కదా అని చెప్పిండు. ప్రతి ఏటా బడ్జెట్‌ రాగానే తెలంగాణకు ఎట్ల అన్యాయం జరిగిందనేది రాసిన అన్నరు. మీటింగ్‌ పెడితే ఎంత మంది వచ్చేదని అడిగితే పదిహేను నుంచి నలభై మంది అని చెప్పేవారు. ఎందుకండీ ఇలా? అని అడిగితే.. మీలాంటి వారు ఎవరో ఒకరు వచ్చి తెలంగాణ జెండా ఎత్తుకుంటరు.. అప్పటిదాకా దీన్ని సజీవంగా కొనసాగించాలని అనుకున్న అన్నరు. చావైనా, బతుకైనా తెలంగాణ కోసమే అని బతికిండు. నమ్మిన సిద్ధాంతం కోసం నిస్వార్థంగా జీవించారు. వర్ధంతి సందర్భంగా ఆయనకు గొప్ప నివాళి అర్పిస్తున్న. మహనీయుడు జయశంకర్‌. ఈ రోజు ఆయనను తలచుకుంటే బర్కత్‌ ఉంటది. మిషన్‌ కాకతీయ పథకం తెలంగాణ ఏర్పడి, నేను సీఎం అయినంక పెట్టింది కాదు. జయశంకర్‌, ఆర్‌ విద్యాసాగర్‌, వీ ప్రకాశ్‌ దీనిపై చాలాసార్లు మాట్లాడుకునేవాళ్లం. తెలంగాణ ఏర్పాటును చూస్తే జయశంకర్‌ తృప్తిపడేవారు. ధన్యజీవి. ఆయన కల నెరవేరింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
33 అంతస్తులతో అద్భుత దవాఖాన
33 అంతస్తులతో అద్భుత దవాఖాన
33 అంతస్తులతో అద్భుత దవాఖాన

ట్రెండింగ్‌

Advertisement