మహబూబ్నగర్ : ఎస్ఎల్బీసీలో ( SLBC Rescue ) జరిగిన ప్రమాద ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి ( Shiva Shanker Loteti ) వెల్లడించారు. శుక్రవారం ఎస్ఎల్బీసీ, టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ సొరంగ ప్రమాద ప్రదేశంలోని డీ-2 ప్రాంతంలో పెద్ద పెద్ద బండ రాళ్లను( Rocks ) తొలగిస్తూ, మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు తరలించే ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుందని వెల్లడించారు. టీబీఎం స్టీల్ భాగాలను అల్ట్రా థర్మల్ కట్టర్లతో కత్తిరిస్తూ లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నామని వివరించారు.
డి వాటరింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన సహాయక సామాగ్రిని, వసతులను, పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ఈ సమీక్షలో సహాయక బృందాల ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.