హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ‘తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్’ (TGICC) సీఈవోగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన నావికాదళం మాజీ అధికారి రవీంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. దాదాపు 10 రోజుల కిందట నియామకం జరిగినా ఉత్తర్వులు బయటకు రాకపోవ డం అనుమానాలను తావిస్తున్నది. భూములతో ముడిపడి ఉన్న టీజీఐఐసీ వ్యవహారాలను ఏపీకి చెందిన వ్యక్తి చేతి లో పెట్టడం వెనుక మతలబు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.
పైగా పరిశ్రమల శాఖలో అనుభవం లేని, పదవీ విరమణ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి కీలకమైన సీఈవో కుర్చీలో కూర్చొబెట్టడం వ్యవ హారం చక్కబెట్టుకోవడానికేనా? అనే సందేహాలు లేవనెత్తుతున్నది. పరిశ్రమల శాఖలోని సీనియర్ అధికారులను సీఈవోలుగా నియమించే సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన సీఎం పక్క రాష్ట్రం వ్యక్తి ని నియమించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సమర్థులైన అధికారులు లేరా?,లేదంటే చిన్నచూపా? అని నిలదీస్తున్నారు. పరిశ్రమలు, రెవెన్యూ శాఖల్లో పనిచేస్తున్న అర్హులైన అధికారులు ఉన్నా దిగుమతి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించడం, కంపెనీల సందేహాలను నివృత్తి చేయడం, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం, అవసరమైన భూముల కేటాయింపు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూసేకరణ నిర్వహించి కొత్త పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయడం వంటి కీలక బాధ్యతలు సీఈవోకు ఉంటాయి. అయితే కనీస అవగాహన లేని వ్యక్తికి ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.