B Vinod Kumar | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ
బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల
నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, గులాబీ కార్యకర్తలు తరలిరానున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం తెస్తామని చెప్పి… తెచ్చి చూపించి తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలైందని.. ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజమన్న ఆయన.. ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.