సూర్యాపేట : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలతో తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది అని విమర్శించారు. రెండేళ్లలో ఒక శాతం అభివృద్ధి చేయని నువ్వు 100 శాతం అభివృద్ధి చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లింగయ్య యాదవ్ మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొంగవి నువ్వు.. నిఖార్సైన ఉద్యమ నేత పేదల పక్షాన పోరాడే మహా నాయకుడు జగదీష్ రెడ్డిపై నిందారోపణలు చేయడం నీ నీతిమాలిన చర్యకు నిదర్శనం అన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి చెరువులు, కుంటలు నింపి దేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించి ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చిన ఘనత జగదీష్ రెడ్డిది అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రెండున్నరేండ్లుగా కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టి వ్యవసాయాన్ని నాశనం చేసిన దుర్మార్గులు కాంగ్రెస్ నేతలని ధ్వజమెత్తారు.
తుంగతుర్తిలో 30 సంవత్సరాలుగా హత్యా రాజకీయాలతో సమాధులు మిగిల్చారని నేడు మీ పాలన చూసి వీరి కోసమా మేము చనిపోయిందని వారి ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. గతంలో అవినీతిమయ పాలన పేదలను దోపిడీ చేసిన 2014కు ముందు ఉన్న చరిత్ర తిరిగి పునరావృతం అవుతుందన్నారు. వేల కోట్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసి సాగు తాగునీరు కల్పించి మౌలిక వసతులు అందించిన ఘనత జగదీష్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవికి వన్నెతెచ్చేలా కాకుండా దిగజార్చేలా మాట్లాడడం నీకు మాత్రమే సాధ్యమవుతుందని నీలాగా ఎత్తు పొడుగు ఉన్న జిల్లా నాయకులు కుటుంబ పాలన సాగించి ప్రజలను దోచుకున్నారన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు, 30 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్, యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పాటు ఎస్సారెస్పీ ద్వారా చివరి పంటకు సాగునీరు అందించే కృష్ణ కింద రెండు పంటలకు నీరు అందించిన మా నాయకుడు జగదీష్ రెడ్డి అన్నారు. అలాగే ఫ్లోరిన్తో వయసు మీద పడి కాళ్ళు వంకర పోతే కేసీఆర్తో మాట్లాడి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా కేంద్రంతో అవార్డు అందుకుంది నిజం కాదా అన్నారు. జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిలో ఒక శాతమైన మీరు చేసి ఉంటే ఎవరి అభివృద్ధి ఏంతో చర్చకు వస్తే తేల్చుకుందామని సవాల్ విసిరారు. నువ్వు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నావని మేము గతంలోనే ఇచ్చామని అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను మా నాయకుడు జగదీష్ రెడ్డి మీడియాకు తెలపడం జరిగిందన్నారు.
తప్పుడు హామీలతో రైతులను నిరుద్యోగులను మహిళలను విద్యార్థులను మోసం చేయడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తున్న నాయకులపై నిరాధారమైన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా నాయకుడు జగదీష్ రెడ్డిపై అనుచితంగా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకొని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ కౌన్సిలర్లు సుంకరి రమేష్, బత్తుల రమేష్, మడిపల్లి విక్రమ్, నాయకులు తూడి నరసింహ రావు, బత్తుల ప్రసాద్, రేణు బాబు, మద్ది శ్రీనివాస్, దొండ శ్రీను తదితరులు ఉన్నారు.