హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లిపోతున్నాయని, గ్రామాలకు గ్రామాలే మునిగిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరద జలాలను కిందికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే లక్షల ఎకరాల్లోని పంట నీట మునుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
గ్రామాల్లో వరద పేరుకుపోయి విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలుతాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలకు హెలికాప్టర్లు వాడుతున్న ప్రభుత్వం వరద బాధితులను కాపాడేందుకు మాత్రం వినియోగించడం లేదని దుయ్యబట్టారు. వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తి కరెంట్ పోల్ ఎక్కి ఏడు గంటలు ఎదురుచూసినా సాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంతటి నిర్లక్ష్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని సుభాష్‌రెడ్డి చెప్పారు. ఒక పక్క భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా మూసీ సుందరీకరణపై రేవంత్ ముచ్చట్లు పెట్టారని మండిపడ్డారు.