హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. అంతటి మహానేతను తూలనాడటం తగదని హితవు పలికారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే కాంగ్రెస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌పై అసభ్యకరమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు పదవులను గడ్డిపోచల్లా భావిస్తారని, సవాళ్లకు వెనుతిరగని బిడ్డలని స్పష్టంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్.. 72 గంటల సమయమిచ్చినా సీఎం రాకుండా పారిపోయారని విమర్శించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి కేటీఆర్‌తో మీ అయ్య అని కాంగ్రెస్ నాయకులు చులకనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ది స్వయంశక్తి నేత అని, ఆయన ఎన్నిసార్లు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీచేసినా గెలుస్తూ వచ్చారని రసమయి బాలకిషన్ స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం అమెరికాలో ఉద్యోగం వదిలి ఇక్కడకు వచ్చారని చెప్పారు. ఆయన విద్యావంతుడు కాబట్టే యూఎస్ఏ, యూకే వంటి దేశాల యూనివర్సిటీలలో జరిగే ప్రపంచస్థాయి సదస్సులలో ప్రసంగించడానికి ఆయనకు ఆహ్వానాలు వస్తున్నాయన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ జేఏసీ ఎక్కడిదని, ఈ విషయంపై కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని రసమయి బాలకిషన్ విమర్శించారు. కేసీఆర్‌కు తెలియకుండా ఉద్యమాలు జరిగాయా? అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని చెప్పారు. వేయి జన్మలెత్తినా కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరు అని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాటి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఉద్యమకారులపైనే ఆయన దాడులు చేశారని విమర్శించారు.
‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రానేరాదు. కాంగ్రెస్‌కు ఇదే చివరిపాలన. ప్రజలు కాంగ్రెస్ నాయకుల తిత్తి తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే నా తలను గాంధీభవన్‌పై వేలాడదీసుకుంటా. ఇదే నా మరణ వాగ్మూలం’ అని రసమయి సంచలన వ్యాఖ్య లు చేశారు. కాంగ్రెస్‌నేత అద్దంకి దయాకర్ ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్‌ను అసెంబ్లీకి రమ్మనడానికి మధుయాష్కీ ఏమైనా ఎమ్మెల్యేనా? అని ప్రశ్నించారు. సమావేశంలో నేతలు బొమ్మర, రామచంద్రనాయక్, అభిలాశ్ పాల్గొన్నారు.