నల్లగొండ, జనవరి 20 : రైతు మహాధర్నాను కుట్రతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని, మొదటగా అనుమతి ఇస్తామన్న పోలీసులు తర్వాత ఇవ్వకుండా చేశారని, పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. రైతు ధర్నాకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు ప్రకటించిన అనంతరం తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు ధర్నా నిర్వహిస్తామని విన్నవించగానే మొదటగా అనుమతి ఇస్తామన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఈఎస్పీ శివరాంరెడ్డి, తర్వాత రద్దు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా ఉందని, రానున్న రోజుల్లో వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తాగుబోతులా పొద్దున ఒక మాట, పొద్దుగూకినాక ఒక మాట మాట్లాడుతూ ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలన్నీ పింక్ బుక్లో రాసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వాస్తవంగా ఈ ధర్నా 12వ తేదీనే పెట్టాల్సి ఉండగా, పండుగ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు 21కి వాయిదా వేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ సభ అంటేనే భయపడుతున్నదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగే హక్కు లేదా అని ప్రశ్నించారు. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.15వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 వంటివి హామీలిచ్చి ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలా కుట్రలు, కేసులతో ఎంతకాలం అడ్డుకోలేరని, త్వరలో కోర్టు అనుమతితో నల్లగొండలో పెద్ద సభ నిర్వహించి ఇచ్చిన రైతు హామీలు నెరవేర్చే వరకు వదిలేదిలేదని హెచ్చరించారు. ఈ నెల 26 నుంచి నాలుగు పథకాలు అమలు చేస్తామన్న ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనర్హులకే ఇచ్చేలా చేస్తున్నదని, దీన్ని ఆయా గ్రామ సభల్లో అధికారులను నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు.