తిరుమలగిరి, డిసెంబర్ 9 : పరిపాలనపై అవగాహన లేని రేవంత్‌రెడ్డి అడ్డిమార్..గుడ్డిగా ముఖ్యమంత్రి అయ్యారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఎద్దేవాచేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ విజయ్‌దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి పొద్దున లేస్తే కేసీఆర్ నామ జపం తప్ప వేరేది లేదని, అపశకున మాటలు, కమీషన్ల దందాలు ఆయన దినచర్య అని దుయ్యబట్టారు. రాత్రి కాగానే పబ్బులు, గబ్బులు అతని వ్యాపకాలని తెలిపారు. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ కోసం రూ.100 కోట్లు దుబారా చేసిన ఘనుడు అని విమర్శించారు. తెలంగాణ వాదులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి పాలనలో రాష్ట్రం ఆగమవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దావోస్ పోయి తెలంగాణ పరువు గంగలో కలిపిండని, అక్కడి ఒప్పందాలు, పెట్టుబడులు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలువదని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఎన్ని పెట్టుబడులు వస్తాయో దేవునికే ఎరుక అని చెప్పారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవారా? ఎక్కడో సీమాంధ్రుల కాళ్లు ఒత్తుకుంటూ ఉండేవారని తెలిపారు. కేసీఆర్‌పై నోరు జారితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పథకాలు తుంగలో తొక్కి, ఒక్క అభివృద్ధి పని చేయకుండా గత ప్రభుత్వంలో మంజూరైన సంక్షేమ పథకాలకు కొబ్బరికాయలు కొట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే, అక్కడ మంత్రి కోమటిరెడ్డి తాగి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదని ఎద్దేవాచేశారు. గతంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో మట్టి కూలుతున్నదని పనులు ఆపగా.. మొనగాండ్లం అని సొరంగం తీసేక్రమంలో 8 మంది మృతికి కారణమయ్యారని మండిపడ్డారు. కనీసం శవాలు కూడా దొరుకలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు బొంద పెట్టుడు ఖాయమని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టంచేశారు.