హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుల సామ్రాజ్యం సాగుతున్నదని, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహారాలు నడుపుతున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్‌రెడ్డి కుటుంబపాలన సాగుతున్నదని మండిపడ్డారు. సోదరుడి అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. బుధవారం తెలంగాణభవన్‌లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాలులో స్పీకర్ దగ్గర వేదికపై కూర్చొని వికారాబాద్ సమీక్షకు హాజరయ్యారని చెప్పారు. ఏ హోదాలో తిరుపతిరెడ్డి అధికారిక సమీక్షకు వెళ్లారని నిలదీశారు. కొడంగల్‌లో తిరుపతిరెడ్డి కల్యాణలక్ష్మి చెకులను పంచుతుంటే తమ పార్టీ జడ్పీటీసీ సభ్యుడు మహిపాల్ అడ్డుకున్నారని గుర్తుచేశారు. రేవంత్ మరో సోదరుడు కొండల్‌రెడ్డికి ఏ హోదా ఉన్నదని అధికారులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు? అని ప్రశ్నించారు.
అక్కడ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మేయర్ సీటులో ఏ ప్రాతిపదికన కూర్చున్నారని మండిపడ్డారు. రేవంత్ ఇంకో సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి కాన్వాయ్‌లో పదుల సంఖ్యలో వాహనాలు ఉంటాయని, ఆయనకు టు ప్లస్ టు సెక్యూరిటీతో రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అన్నదమ్ములను రాష్ట్రంపై వదిలేశారని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆయన సోదరులు మూడు నెలల్లోనే నాలుగు కంపెనీలు ఏర్పాటుచేశారని చెప్పారు.
నాలుగు కంపెనీల్లో రేవంత్ సోదరులు డైరెక్టర్లుగా ఉన్నారని, వాటి వివరాలను మీడియాకు చూపించారు. వారు తమ మిత్రులతో కలిసి మరో 10-15 కంపెనీలు ఏర్పాటు చేశారని, వీటి వివరాలను త్వరలోనే అందిస్తానని చెప్పారు. రేవంత్ అమెరికా పర్యటనలో ‘స్వచ్ఛ్ బయో’తో రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నదని, ఆ కంపెనీ రేవంత్ సోదరుడు ఎనుముల జగదీశ్వర్రెడ్డిదని, అది 15 రోజుల క్రితమే ఏర్పాటైందని విమర్శించారు. రేవంత్ సోదరులు రియల్టర్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ బ్లాక్‌మనీని ఈ కంపెనీల ద్వారానే వైట్‌గా మారుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, రాజేశ్‌నాయక్ పాల్గొన్నారు.