హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నదని, పైపెచ్చు గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెర లేపిందని, మేడిగడ్డ బరాజ్ నుంచి 92 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించేందుకు టెండర్లు పిలిచిందని, ఇది గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా గతంలో ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేస్తూ.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని ప్రకటించారు. రైతులకు సాగునీరు అందించకుండా ఇసుకను దోచుకునే ప్రణాళికను కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకతోపాటు అన్ని దందాల్లో కాంగ్రెస్ నేతలు కూరుకుపోయారని విమర్శించారు.
గనుల ధారాదత్తానికి కుట్ర
ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాలు దయనీయ స్థితిలో ఉన్నాయని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ముల్లా తెలంగాణలోని గనులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. ఐరన్, సున్నపురాయి, మాంగనీసు గనుల వేలానికి గడువు విధిస్తూ కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, ఆ లేఖపై రేవంత్ సర్కారు తన వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. ఈ నెల 21న దేశవ్యాప్తంగా 52 బొగ్గు బ్లాకులను వేయనున్నట్టు సమాచారం ఉన్నదని, వాటిలో సింగరేణి బ్లాకులు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించేలా ప్రభుత్వం ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే ఉండాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని సీఎం రేవంత్‌ను నిలదీశారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నపురాయి గనులను, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజాన్ని కేటాయించేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కోరారు.
నీట్‌ను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలి
నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గొర్రెల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ ఆ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోక్యం చేసుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. రూ.లక్షలతో నీట్ ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసినట్టు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై ఈడీ జోక్యం చేసుకోదా? అని ప్రశ్నించారు. నీట్ విషయంలో కూడా కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయని ఆయన ఆరోపిస్తూ.. ఈ పరీక్షపై సీఎం రేవంత్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ ద్వారా తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని అన్నారు.
కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై ఏది?
రేవంత్‌రెడ్డికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదని.. ఆయన బీర్, బార్ సహా దేన్నీ వదలడంలేదని బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పంచ భూతాలను సైతం వదలకుండా సహజసంపదను దోచుకుంటున్నారని తూర్పారబట్టారు. సీఎం కోసం రూ.కోట్లతో హెచ్‌జీసీఎల్ భవనాన్ని ఆధునీకరిస్తున్నారని, ఎంసీఆర్హెచ్ఆర్డీలో మరో భవనాన్ని నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, తుంగ బాలు కూడా పాల్గొన్నారు.