వేల్పూర్, నవంబర్ 25 : కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నాడు వద్దన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సర్వే ఎలా చేయిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసానికి సోమవారం సర్వే కోసం వచ్చిన ఎన్యూమరేటర్లతో ఆయన మాట్లాడారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా వారికి చూపించారు. నాడు సర్వే వద్దని మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఎలా సర్వే చేపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులకు విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర, చరాస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
తనకు వివరాలు ఇవ్వటానికి అభ్యంతరం లేదని, కానీ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను తప్పు అంటూ వివరాలు సేకరించటానికి అడ్డమైన వాళ్లను ఇంటికి పంపిస్తారంటూ రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పిన తర్వాతే వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే వేముల డిమాండ్ చేశారు. గడువులోగా పూర్తి చేయాలనే ఆతృతతో సర్వే చేస్తే తప్పులు దొర్లే ప్రమాదం ఉన్నదని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలతోపాటు మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వే ద్వారా సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే పేరిట టీవీ, ఫ్రిడ్జ్, స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని వేముల హెచ్చరించారు.