Kaleshwaram | మోర్తాడ్/ముప్కాల్, ఆగస్టు 7: మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. నీటిని ఎత్తిపోయకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా సముద్రంలోకి పోయేలా చేసి రైతులను ఏడిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ, కాకతీయ కాలువలకు వేముల బుధవారం నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు సాగు, తాగునీటి ఇబ్బంది ఉండొద్దని ప్రాణహిత, గోదావరి కలిసే చోట మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టు తెలిపారు. రూ.90 వేల కోట్ల ప్రాజెక్టులో భాగంగా రూ.4 వేల కోట్లతో మేడిగడ్డ బరాజ్ నిర్మించినట్టు చెప్పారు. అందులోని 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు కుంగితే దాన్ని సాకుగా చూపి కాళేశ్వరం పూర్తిగా కొట్టుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేసి రైతులను ఆగం చేసిందని మండిపడ్డారు.
నీళ్లు ఎత్తిపోసి మిడ్‌మానేరు, అనంతసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీకి కూడా నీళ్లు తీసుకువచ్చి రైతాంగానికి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ పనిచేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లి నీళ్లు ఎత్తిపోయకుంటే తామే వేలాది రైతులతో వచ్చి మోటర్లు ఆన్ చేస్తామని అల్టిమేటం ఇవ్వడంతో ప్రభుత్వం దిగివచ్చిందని అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉన్నందున గుత్ప, అలీసాగర్ లిఫ్ట్‌లను నడిపించి ఆయకట్టుకు సాగునీటిని అందించాలని సూచించారు. లేకపోతే వందలాది రైతులతో కలిసి వచ్చి తామే మోటర్లు ఆన్ చేస్తామని వేముల అల్టిమేటం జారీ చేశారు. రైతుల ప్రయోజనాల కోణంలో ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ప్రశాంత్‌రెడ్డి చెప్తే నీళ్లు ఇవ్వాలా? అని ప్రభుత్వం భేషజాలకు పోకూడదని సూచించారు.