హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఏ నిబంధన ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేశారో? ఆయా కులాలను 3 గ్రూపులుగా ఎలా నిర్ణయించారో? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన కొన్ని కులాలను గ్రూప్-1లో ఎలా చేర్చారని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, ఎన్నో ఏండ్ల్లుగా కులవివక్ష అనుభవిస్తున్న మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో బుధవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొమ్మెర రామ్మూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు.
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పెట్టిందని చెప్పారు. మంద కృష్ణ మాదిగ 30 ఏండ్లు రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పోరాడారని, ఈ క్రమంలో చాలా మంది అమరులయ్యారని గుర్తుచేశారు. మాదిగలు 3.5 లక్షలు, మాలలు 1.5 లక్షల మంది ఉన్నారని, జనాభా వెనుకబాటు బట్టి రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. జనాభా ప్రకారం మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ క్యాటగిరీల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హస్తం ఉన్నదని ఆరోపించారు. ఖర్గే, కొప్పుల రాజు, భట్టి, వివేక్ వెంకటస్వామి లాబీయింగ్‌కు రేవంత్‌రెడ్డి లొంగారని, అందుకే మాలలకు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.