Srinivas Goud | యాదాద్రి భువనగిరి : తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. తక్షణమే టెండర్లు రద్దు చేసి, కల్లుగీత కార్పొరేషన్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నీరా కేఫ్, దాని సంబంధిత ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారన్న ఆందోళన నేపథ్యంలో భువనగిరి మాజీ శాసన సభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్లతో కలిసి యాదాద్రి జిల్లా నందనం వద్ద రూ. 7 కోట్లతో నెలకొల్పిన నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు.
కల్లుగీత కార్మికులు, గౌడ్ల అభ్యున్నతి కోసం తాము నీరా కేఫ్, నందనం నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని నెలకొల్పామని.. నందనం అన్ని హంగులతో పూర్తయినప్పటికీ, ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభించలేకపోయామని చెప్పారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరన్నర కాలంగా ప్రారంభించకపోవడంతో యంత్రాలు తుప్పుపడుతున్నాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖా మంత్రి తక్షణమే నందనం కేంద్రాన్ని సందర్శించి, జూన్ 2వ తేదీలోగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గీత కార్మికుడికి సేఫ్టీ మేకప్ ఇవ్వాలని, వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు ఇస్తున్న 15 శాతాన్ని 25 శాతానికి పెంచాలని, జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.