Srinivas Goud | కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇదే విషయాన్ని తాము మొదట్నుంచి చెబుతున్నామని తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కులగణన ఏదో గొప్పగా చేశామని ఇది దేశానికి రోల్ మోడల్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో చెప్పిందేమిటి ?చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు. కులగణన తప్పుల తడకగా చేశారని .. అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మూడేనా మంత్రి పదవులు అని నిలదీశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత ఏదీ ? కీలక శాఖలు బీసీల దగ్గర ఎందుకు లేవు? ఏడాదికి రూ.20వేల కోట్లు బీసీ లకు బడ్జెట్ లో పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని మండిపడ్డారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి ? 42 శాతం సీట్లు బీసీలు ఎలాగైనా గెలుస్తారు.. మీరు ఇచ్చేది ఏమిటి అని నిలదీశారు.
కేంద్రానికి బీసీ బిల్లును పంపించి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినపుడు బీసీ బిల్లు చట్టబద్ధత గురించి ఎందుకు చర్చించ లేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలోని అన్ని కులాలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఇంకా ఎన్నాళ్లు బీసీలను మోసం చేస్తారని మండిపడ్డారు. ఏదో రైతుబంధు డబ్బులు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వచ్చే ఎన్నికల దాకా ఏ హామీలను పట్టించుకోరని తెలిపారు. రెండుసార్లు మోసపోయిన ప్రజలు.. ఇకపై మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో కులవృత్తుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. బీసీలు అప్రమత్తంగా లేకపోతే కాంగ్రెస్ ఆగడాలకు అంతే ఉండదని పేర్కొన్నారు. దీనిపై బీసీ సంఘాలు కూడా స్పందించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు . కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తే బీసీలు కాంగ్రెస్‌కు రెడ్ కార్పెట్ పరుస్తారని చెప్పారు.
అందాల పోటీలతో డబ్బులు వృథా చేశారని.. అదే ఫార్ములా ఈ రేసింగ్‌లో ఎలాంటి అవినీతి జరగకున్నా కానీ కేటీఆర్‌ను విచారణ పేరుతో వేధిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నోటీసులకు భయపడమని స్పష్టం చేవారు. అన్ని పార్టీల్లోని బీసీలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు.