హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తేతెలంగాణ): ‘పోరాడి తెచ్చుకొన్న తెలంగాణలో ఆంధ్రా అధికారులు పెత్తనమేంది? వారి తీరుతో తెలంగాణ ఉద్యోగులకు తీరని శాపంగా మారింది. ఏపీ ఉద్యోగులకు ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ కీలక పోస్టింగ్‌లు ఇచ్చి మన రాష్ట్ర అధికారులను అవమానిస్తున్నది’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, వాల్యానాయక్, రామచంద్రునాయక్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆంధ్రా నుంచి వచ్చీ రావడంతోనే ఓ అధికారిని ఎైక్సెజ్ కమిషనర్‌గా నియమించడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు.
సదరు అధికారి దురుసు ప్రవర్తన, దుందుడుకు చర్యలతో తెలంగాణ అధికారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తిట్ల దండకంతో తెలంగాణ ఉద్యోగులు గుండెపోటుకు గురవుతున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ఆ అధికారి కులం పేరుతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఎైక్సెజ్ కమిషనర్ వ్యవహార శైలితో ఆ శాఖలోని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో సర్కార్ పెద్దల ఒత్తిళ్లు భరించలేక ఓ ఐఏఎస్ అధికారి ఏకంగా ఉద్యోగ విరమణ పొందారని గుర్తుచేశారు. తాజాగా సోమిరెడ్డి అనే సిన్సియర్ ఆఫీసర్ కుప్పకూలి దవాఖానలో చేరారని చెప్పారు. ఆయనకు ఏమైనా జరిగితే కమిషనర్‌తోపాటు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తెలంగాణలో విచ్చలవిడిగా ఏపీ మద్యం అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల కూకట్‌పల్లిలోని ఓ వైన్‌షాప్‌లో ఆంధ్రా మద్యం దొరికిందని, అది తెలంగాణలోకి ఎలా వచ్చిందో సంబంధిత శాఖ అధికారులే చెప్పాలని ప్రశ్నించారు.
హ్యాట్సాఫ్ టు సోమిరెడ్డి
‘ఆంధ్రా ప్రాంత అధికారి దుర్భాషలాడటంతో ఎైక్సెజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తాను ఉద్యోగం చేయలేనని ఆత్మగౌరవం ప్రదర్శించారు.. హ్యాట్సాఫ్ టు సోమిరెడ్డి’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కితాబిచ్చారు. దీనిని అన్ని శాఖల్లోని తెలంగాణ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మన ప్రాంతానికి చెందిన కొందరు కానిస్టేబుళ్లను అకారణంగా, నిబంధనలకు విరుద్ధంగా అంతర్ జిల్లాల పరిధిలో బదిలీలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కొందరు ఆంధ్రా అధికారులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తెలంగాణ ఆత్మగౌరవ పతాకను ఎగురవేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.
సోమిరెడ్డికి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శ
ఆంధ్రా అధికారి దుర్భాషతో అవమానానికి గురై కుప్పుకూలి చికిత్స పొందుతున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని శనివారం హైదరాబాద్ నాంపల్లి కేర్ దవాఖానలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. నిజాయితీ కలిగిన అధికారికి ఇలాంటి అవమానం జరుగడం సహించరానిదని పేర్కొన్నారు. తెలంగాణ అధికారులను అవమానాల పాలు చేస్తున్న ఆంధ్రా అధికారులను ఇక్కడి నుంచి వారి స్వరాష్ర్టానికి పంపించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ కోరారు. మరో అధికారికి ఇలాంటి అవమానాలు కలిగించవద్దని హెచ్చరించారు.