హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): పాలమూరు ప్రాజెక్టుల దగ్గర సీఎం సమీక్ష నిర్వహిస్తే రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు 90% పూర్తయ్యాయని, మిగిలినవి పూర్తిచేయాలని సూచించారు. తెలంగాణ తెచ్చుకున్నది ప్రాజెక్టుల పనులు నిలిపి వేయడానికి కాదని హెచ్చరించారు.
గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి, పాలమూరు జిల్లాను వెనుబడేసిన కాంగ్రెస్ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు యాత్రకు పోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని గుర్తుచేశారు. పాలమూరులో ఐదు రిజర్వాయర్లు కేసీఆర్ హయాంలోనే నిర్మించారని, మిగతావి కాంగ్రెస్ పూర్తి చేయాలని సూచించారు.
పాలమూరులో పోటీ యాత్రలు కాదని, తమతో పోటీ పడి పనిచేయాలని చురకలేశారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయలేక, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరికి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేశారు కనుకే పంట విస్తీర్ణం పెరిగిందని స్పష్టంచేశారు. కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టాలని, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు మన నీటి వాటా కోసం గట్టిగా కొట్లాడాలని సూచించారు.
పాలమూరు ప్రజలతో ఆటలొద్దు
పాలమూరు జిల్లా ప్రజలతో ఆటలాడొద్దని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సందర్శిస్తున్నారా? లేక పోటీ యాత్రనా? చెప్పాలని డిమాండ్ చేశారు. తాము నల్లగొండ సభ పెడితే కాంగ్రెస్ మేడిగడ్డ పోయిందని, ఇప్పుడు తాము మేడిగడ్డకు అంటే పాలమూరు-రంగారెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పూర్తి చేసిందని, మిగిలినవి పూర్తిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడం వల్లనే ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పారు. కాంగ్రెస్ నిర్వాకం వల్లనే పాలమూరు జిల్లా వెనకబడిందని మండిపడ్డారు. పాలమూరు వలసలకు కాంగ్రెస్ కారణమని, డ్రామాలు చేయొద్దని, డ్రామాలు మానుకోవాలని సూచించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందని, దృష్టంతా ఆంధ్రా ప్రాజెక్టులపైనే ఉండేదని ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ ప్రాజెక్టులకు మోక్షం లభించిందని చెప్పారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు.