హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఓబీసీ కుటుంబాల లెక్క తేల్చాలని, ఈ విషయంలో ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ఓబీసీల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జనగణన విషయంలో ఎస్సీలు, ఎస్టీల కుటుంబాల కోసం ప్రత్యేక కాలం ఏర్పాటుచేసినట్టే 34వ కాలంగా ఓబీసీ కుటుంబాల కోసం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయంగా ప్రధానమంత్రి ఓబీసీయే అయినప్పటికీ ఒక్క మంత్రిత్వ శాఖ గానీ, బడ్జెట్లో నిధులు కానీ పెట్టలేదని తవిమర్శించారు. అదే విధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నదని, ప్రస్తుతం ఆ ఫైల్ ఎంతవరకు వచ్చిందో ఊసేలేదని దుయ్యబట్టారు. బీసీ, ఓబీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప వారికి న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 20 ఏండ్ల తర్వాత కులగణన చేస్తామని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిందని, ఇదే విషయాన్ని చాలా రాష్ర్టాల్లో ప్రచారంలో గొప్పగా చెప్పారంటూ ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లక్షలాది మంది ఓబీసీలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని, జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.