హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిననే సోయి లేకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన భాష జుగుప్సాకరంగా ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా సీఎం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. మహిళల గురించి అభ్యంతరకరంగా మాట్లాడటం ద్వారా సీఎం సంస్కారం, నీతి అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూనే మహిళలను అగౌరవపర్చేవిధంగా సీఎం మాట్లాడారని దుయ్యబట్టారు. బుధవారం ఆమె తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం 600 కొర్రీలు పెడుతున్నదని, బడ్జెట్లో రూ.53 వేలు కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సవాలక్ష షరతులతో లబ్ధిదారులను తగ్గించే విధంగా నిబంధనలను విధించారని మండిపడ్డారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోసమే..
పార్లమెంట్ ఎన్నికల కోసమే హడావుడిగా గ్యాస్, ఉచిత కరెంటు పథకాలను ప్రారంభించారని సత్యవతి రాథోడ్ దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయని, మిగిలిన తొమ్మిది కూడా వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2,500 హామీ ఏమైందని ప్రశ్నించారు. రూ.500కే గ్యాస్ పథకాన్ని 40 లక్షల మందికే ఇస్తున్నారని మండిపడ్డారు. పురుషుల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లకు కూడా సబ్సిడీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు 101 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇచ్చిందని గుర్తుచేశారు. మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని డిమాండ్ చేశారు.
భాష మార్చుకో..
రేవంత్‌రెడ్డి పరుష పదజాలం మానుకోవాలని సత్యవతిరాథోడ్ సూచించారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ సీటును టచ్ చేసేవాళ్లు ఆయన పకనే ఉన్నారన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసిన ఉద్యోగ నియామకపత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవి కావా? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక టీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కౌలురైతులను ఏవిధంగా గుర్తిస్తారని, పండించిన పంటలకు బోనస్ ధర ఏమైందని ప్రశ్నించారు.
రేవంత్ నోరు అదుపులో పెట్టుకో: వాసుదేవరెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటి కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డి సవాల్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉన్నదని మండిపడ్డారు. రేవంత్ అండ్ కో నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఇష్టమొచ్చినట్టు తూలనాడటం మంచిది కాదని హితవుచెప్పారు.