హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తాను ఇంచు ప్రభుత్వ భూమిని ఆక్రమించినా కూల్చేయండి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున విచారణ జరిపి తొలగింపు చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం పర్యటన సందర్భంగా
సీఎం, మంత్రులు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అజయ్ ఆక్రమణల వల్లే ఖమ్మం మునిగిందంటూ సీఎం చేస్తున్న ఆరోపణల్లో పస లేదని పేర్కొన్నారు. తన దవాఖాన ఖమ్మం ఉత్తర దిక్కున ఉన్నదని, మున్నేరుకు దానికి అసలు సంబంధమే లేదని వివరించారు. హాస్పిటల్ నిర్మించి 25 ఏండ్లు అయిందని, ఆ ప్రాంతాల్లోకి చుక నీరు రాలేదని తెలిపారు. మున్నేరుకు వరద ఎకడి నుంచి వస్తున్నదో రేవంత్‌రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. మున్నేరు పరివాహక ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప, జలగంనగర్ కాలనీలు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు.
రిటైనింగ్ వాల్‌కు కేసీఆర్ 650 కోట్లు ఇచ్చారు
పాకాల సరస్సు వద్ద పుట్టిన మున్నేరులో ఆకేరు, వైరా ప్రవాహాలు కలుస్తాయని, ఏటా మున్నేరు పొంగడం సహజమేనని పువ్వాడ వివరించారు. బీఆర్ఎస్ పాలనలో మున్నేరు వరద పొంగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి అక్కడి నుంచి తరలించేవారమని తెలిపారు. ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తరలించడంలో విఫలమైందని విమర్శించారు. వరదలకు శాశ్వత పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో మున్నేరుకు రెండువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు రూ.650 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. వాల్ నిర్మాణ పనులను రేవంత్ ప్రభుత్వం పునరుద్ధరించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అజయ్‌ను అంతమొందిస్తే బాధలు పోతయా?
అజయ్‌ను అంతమొందిస్తే వరద బాధితుల బాధలు తీరుతయా? అని పువ్వాడ ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తే కాంగ్రెస్ నేతలు తమపై దాడులు చేశారని, వారి పేర్లతోపాటు సీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఖమ్మంలో తుమ్మల మనుషులే తమపై దాడి చేశారని చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మోకాళ్లలోతు బురదలో దిగి బాధితులను పరామర్శిస్తే, ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎన్నికల పర్యటనకు వచ్చినట్టు వచ్చి వెళ్లారని మండిపడ్డారు. మూడు రోజులైనా మున్నేరు వరద బాధితులకు విద్యుత్తు, తాగునీరు అందలేదని విమర్శించారు.
ఒక్కరినైనా ఎందుకు అరెస్టు చేయలేదు: గోపాల్
ఖమ్మంలో బీఆర్ఎస్ బృందంపై దాడి కాంగ్రెస్ గూండాల పని అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. ఖమ్మంలో కబ్జాలన్నీ కాంగ్రెస్ నేతల చలవేనని విమర్శించారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ముందు కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలు కూల్చాలని సవాల్ చేశారు. వరద బాధితులను ఆదుకొనే చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం గూండాయిజాన్ని ప్రోత్సహించడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.
దాడికి దర్శకుడు రేవంతే: బాల్క సుమన్
ఖమ్మంలో బీఆర్ఎస్ బృందంపై జరిగిన దాడికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రేవంత్‌రెడ్డి, నిర్మాత పొంగులేటి అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై డీజీపీ స్పందించలేదని, పోలీసులు అతిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల కబ్జా చిట్టా బయటపెడతామని చెప్పారు. హైడ్రా పేరిట కొంతమందిని లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు.
2 నెలలకు సరిపడా సరుకులివ్వాలి: నవీన్
మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు ఏ మూలకు సరిపోవని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఇల్లు నీట మునిగిన కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడంతోపాటు నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నాడు హెలికాప్టర్ తెప్పించాలని కోరిన సీతక్క నేడు మంత్రిగా ఉండి ఎందుకు తెప్పించలేకపోయారని ప్రశ్నించారు. పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్ సంగతేమిటి?
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఫంక్షన్ హాల్ నిర్మించారని, జిల్లాకు చెందిన మరో మంత్రి వక్ఫ్‌బోర్డు భూములు ఆక్రమించి విల్లాలు కట్టారని పువ్వాడ అజయ్ ఆరోపించారు. పొంగులేటి నిర్మించిన ఫంక్షన్‌హాల్‌ను ఎప్పుడు కూల్చి వేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మంత్రి పొంగులేటి ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో సర్వే నంబర్ 140/2లో అర ఎకరానికిపైగా నీటిపారుదల శాఖ (నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్)కు చెందిన భూమిని ఆక్రమించి ఎస్ఆర్ గార్డెన్ నిర్మించారని ఆరోపించారు. గతంలో ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ సర్వే చేసి కబ్జా విషయాన్ని నిర్ధ్దారించారని, దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలకు దిగగా, పొంగులేటి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. కంచె చేను మేసినట్టు మంత్రులే ప్రభుత్వ భూములను ఆక్రమించి, పైగా తాను ఆక్రమించినట్టు బట్టకాల్చి మీదేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, కట్టిన నిర్మాణాలను తొలగించాలనుకొంటే ముందుగా పొంగులేటి ఎస్ఆర్ గార్డెన్‌ను కూల్చాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.