Puvvada Ajay Kumar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ పట్ల మాగంటి గోపినాథ్ ఎంత విశ్వాసంగా ఉన్నారో.. కేసీఆర్ పట్ల అంత కంటే ఎక్కువగా ఉన్నారు. తనను పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారని అయినా చివరివరకు కేసీఆర్‌తోనే ఉంటానని వారికి చెప్పానని గోపినాథ్ అన్నారు. గోపినాథ్ చనిపోయినపుడు కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుడు కోల్పోతే ఎంత భాధపడుతారో అంత భాధ పడ్డారు. మాగంటి సునీత కన్నీళ్లను కూడా మంత్రులు వెటకారం చేసేలా మాట్లాడడాన్ని ప్రపంచం అంతా చూసింది. ఒక ఆడబిడ్డపై అంత నీచంగా మాట్లాడడం తగదు అని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్లే కమ్మ సామాజికవర్గానికి కూడా కేసీఆర్ మంచి గుర్తింపు ఇచ్చారు. రాజకీయంగా, అన్ని రంగాల్లోనూ అవకాశాలు చాలా ఇచ్చి ప్రోత్సహించారు. సినీ నటుడు కృష్ణ చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని చెప్పిన మహనీయుడు కేసీఆర్. ఇవాళ ఎన్నిక వచ్చిందని ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ హడావుడి చేస్తున్నారు అని మాజీ మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు.