Niranjan Reddy | హైదరాబాద్ : ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని రేవంత్, చంద్రబాబు భేటీపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గత పదేండ్ల నుంచి ఎవరి మానాన వారు బతుకుతున్నారు. కానీ మానిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు చంద్రబాబు, రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మేం మళ్లీ మా పాత్ర పోషిస్తామని రాజకీయ ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఆంధ్రాలో సీఎం అయ్యారు. తెలంగాణ రాజధానిలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదు. పెళ్లికొడుకు ఒకచోట.. పెళ్లి ఒకచోట.. పందిరి మాత్రం తెలంగాణలో వేస్తున్నరు. ఆర్భాటం హైదరాబాద్లో చేస్తున్నరు. హైదరాబాద్లో ఆర్భాటం ఎందుకు..? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అపరిష్కృత అంశాల మీద చర్చ అనుకుంటే ఆ అడుగులు వేరేలా ఉండేవి. కానీ అలా లేవు. పరోక్షంగా తెలంగాణను పరిపాలించేటటువంటి కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన సవ్యంగా లేదు. ప్రజలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉంది. నిరుద్యోగులను, యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. కానీ ఇవాళ నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వినడం లేదు. టీఎస్పీఎస్సీ వద్ద కంచెలు వేయించి అమానుషంగా నిరుద్యోగులను అరెస్టు చేశారు. చివరకు రహదారిపై వెళ్తున్న దంపతులను, రైతులను కూడా అరెస్టు చేశారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు కట్టుబడి ఉందా..? మేనిఫెస్టోలో పేర్కొన్న గ్యారెంటీలు ఏమయ్యాయి..? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.