Niranjan Reddy | హైదరాబాద్ : తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. గురుకులాలను వెంటాడుతున్న సమస్యలు, విద్యార్థుల నిరసనలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవిష్యత్ రోడ్డెక్కిందని సీఎం రేవంత్ రెడ్డిపై నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
నాడు కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కారు. నేడు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తమ సమస్యల పరిష్కారం కోసం గురుకుల పాఠశాలల విద్యార్థులు రోడ్లెక్కుతున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల జిల్లా అలంపూర్ మండలం పుల్లూరు గ్రామంలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో తాగునీరు రాక ఉప్పు నీరు తాగుతున్నామని, పురుగుల అన్నం తింటున్నామని, మరుగుదొడ్లు సరిగ్గా లేక బహిర్భూమికి పంట పొలాల్లోకి వెళ్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం బడిపిల్లల పాదయాత్రను కూడా బెదిరించి విద్యార్థులను డీసీఎంలో ఎక్కించి వెనక్కి తీసుకెళ్లడం కాంగ్రెస్ సర్కార్ నిర్భంధానికి నిదర్శనం. సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది అని నిప్పులు చెరిగారు.
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలో గురుకుల విద్యార్థులు 150 మంది కలుషిత ఆహారం తిని ఆస్పత్రి పాలయిన ఘటన మరవక ముందే పుల్లూరు విద్యార్థులు రోడ్డెక్కడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. గురుకులాల్లో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. పుల్లూరు గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.