హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కాదని, చంద్రబాబు పెంపుడు బిడ్డ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు సభలో రేవంత్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు, సుప్రీం కోర్టులను కోరారు. రాజ్యాంగబద్ధ ప్రమాణం చేసి నేరపూరిత భాష మాట్లాడటం విధ్వంసం, అరాచకత్వం, ఉగవాదాన్ని ప్రోత్సహించేలా ఉ
న్నదని విమర్శించారు. రాజకీయ పరిశీలకులు, మేధావులు అసహ్యించుకునేలా రేవంత్ మాటలు ఉన్నాయని అన్నారు. రేవంత్‌ది ఉన్మాద భాష అని చెప్పారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినందుకు పాలమూరు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ పదేపదే పాలమూరు బిడ్డనన్న ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతున్నారని, అసలు పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలపై రేవంత్‌కు ఉన్న ఆర్తి ఏమిటి? అని ప్రశ్నించారు. పాలమూరు మీద ప్రేమ ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోదీ సభలో జాతీయహోదా కావాలని ఎందుకు అడగలేదని నిలదీశారు. పాలమూరుపై ప్రేమ ఉంటే ఉద్యమంలోనే కలిసి వచ్చేవారని తెలిపారు. కేసీఆర్‌ను మరిపించాలంటే మరింత మంచిపనులు చేయాలని హితవు చెప్పారు.
కేసీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడుతున్న రేవంత్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా హుందాగా మాట్లాడాలని, లేకపోతే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత అని హెచ్చరించారు. ఇక, కాంగెస్ ప్రభుత్వానికి ప్రణాళిక, ముందుచూపు లేవని విమర్శించారు. రాహుల్‌గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా తిరుగుతుంటే, రేవంత్‌రెడ్డి మాత్రం మోదీని మెచ్చుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ మేలు కోసం తాము కూడా కేంద్రంతో సఖ్యతతోనే ఉన్నామని, కానీ, కేంద్రం నుంచే సహకారం అందలేదని స్పష్టం చేశారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పినందుకు పాలమూరు ప్రజలకు రేవంత్, కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి శత్రువు కేసీఆరే అని తెలిపారు. నెహ్రూ, ఆయన కుటుంబాన్ని బీజేపీ తిడితే కాంగ్రెస్ నేతలు కండ్లు అప్పగించి చూశారని వెల్లడించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండించింది కేసీఆరేనని గుర్తు చేశారు. ఆదే కేసీఆర్ గొప్పతనమని స్పష్టం చేశారు.