Niranjan Reddy | హైదరాబాద్ : రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ నినాదాల ద్వారా ఈ దేశం అభ్యున్నతి, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కట్టుబడి పనిచేయాలో, రైతు శ్రేయస్సు, వ్యవసాయరంగం ఎంత కీలకమైందో స్వాతంత్య్ర ఫలాలు అందుకోవడం అంటే వ్యవసాయరంగ అభివృద్ధి అని ఆ స్ఫూర్తి యొక్క లక్ష్యం. ఈ నినాదం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ సంధర్భంగా జరుగుతున్న 79వ స్వాతంత్య్ర వేడుకల సమయంలో జై కిసాన్లు నై యూరియా అని రోడ్ల మీదకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి ఒక్క బస్తా యూరియా కోసం పాట్లు పడుతున్నారు. ఆధార్ కార్డులు తీసుకుని వెళ్లి రోజుల తరబడి లైన్లో ఉంటే భార్యాభర్తలకు కలిపి ఒక్కటే బస్తా యూరియా ఇస్తున్నారు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ యూరియా అనేది వారు మరో చోట అమ్ముకునేది కాదు. బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా నమ్మి ఓట్లేసినందుకు రైతుల ఆశలు అడియాసలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉన్నది.. యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. కేటాయించిన కోటా ఇచ్చామని కేంద్రం చెప్పి చేతులు దులుపుకుంటుంది.. కేంద్రానికి లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది ? మరి యూరియా ఎక్కడకు పోయింది అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.
రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు..? దేశంలోని, ప్రపంచంలోని అన్ని విషయాల మీద మాట్లాడే ఈ ఎంపీలు రైతులకు యూరియా విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు. గతంలో ఉల్లిగడ్డల కొరత మీద సెటైర్లు వేసేది.. తాజాగా తెలంగాణలో యూరియా కొరత నేపథ్యంలో బస్తా బహుమతిగా ఇచ్చి రైతులు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పరిస్థితి వచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. రాష్ట్రంలో మంత్రులు, ముఖ్యమంత్రి రోజూ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. వీరంతా సిపాయిలు అయితే రైతులకు యూరియా అందించడంలో ఎందుకు విఫలం అవుతున్నారు? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వరి 45.21 లక్షల ఎకరాలలో సాగయింది. పత్తి 44.64 లక్షల ఎకరాలలో సాగయింది. ఇతర పంటలు 18.64 లక్షల ఎకరాలలో, ఉద్యానపంటలు 9.34 లక్షల ఎకరాలలో మొత్తం 117.83 లక్షల ఎకరాలలో ఈ వానాకాలంలో పంటలు సాగవుతున్నాయి. గత ఏడాది 66.78 లక్షల ఎకరాలలో వరి వేశారు. రాష్ట్రంలో గత ఏడాదికంటే 22 లక్షల ఎకరాలలో వరి సాగు తగ్గిపోయింది. మొత్తం పంటల విస్తీర్ణం ప్రకారం గత ఏడాదికన్నా 10 లక్షల ఎకరాలలో సాగు తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 2022లో అన్ని పంటలు కలిపి వానాకాలంలో 1.35 కోట్ల ఎకరాలలో సాగయ్యాయి. అప్పట్లో ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని పంటలకు సక్రమంగా సరఫరా చేశాం. ఇప్పుడు 22 లక్షల ఎకరాలలో వరి సాగు తగ్గినా యూరియా ఇవ్వలేకపోవడం సర్కారు ఘోర వైఫల్యం కాదా ? చేతగానితనం కాదా ? దీనికోసమే ప్రజలు మీకు ఓట్లేశారా ? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.