Niranjan Reddy | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే ఎక్కువ ప్రయత్నం చేస్తున్నది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకు పోయే ప్రయత్నాలకు ఈ ప్రభుత్వం సహకరిస్తుంది అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించిన తర్వాతనే ఈ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో స్పందించింది. అఖిలపక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడడంతో పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆయన సమావేశం నుండి బయటకు వచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన వద్దిరాజును కించపరిచినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎంకు ఈ విషయంలో ఏదో పాండిత్యం ఉన్నట్లు మాట్లాడారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏదో సాధించినట్లు వారిని పొగిడారు అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
కేంద్ర అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒప్పందంగా చిత్రీకరించడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.. సమావేశంలో ఎవరు ఏం మాట్లాడినా రికార్డ్ చేస్తారన్న విషయం తెలియకపోవడం విడ్డూరం. మొత్తం సమావేశంలో బనకచర్లను ఖచ్చితంగా అడ్డుకుని తీరతాం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదు..? పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.32,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేసింది.. ఇక్కడ కేవలం 172 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది.. ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. మిగిలిన పనులు పూర్తి చేసి వెంటనే నీటి కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదు అని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
రేవంత్ మాట్లాడే భాష ఆయనకు అందంగా అనిపించవచ్చు.. కానీ ముఖ్యమంత్రి హోదాకు అది తగదు.. మీరు మాట్లాడే భాష మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణ ఇప్పటికే నష్టపోయింది.. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం జరిగింది.. ఏపీలో కేవలం తెలుగుగంగకు మాత్రమే నీటి కేటాయింపు ఉంది.. కానీ ఆంధ్రాలో 300 టీఎంసీల సామర్ధ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నారు.. ప్రస్తుతం కృష్ణా నదిలో తగినంత నీరు అందుబాటులో లేదు. కృష్ణా బేసిన్‌కు కాళేశ్వరం ద్వారా సాగునీటిని తరలించాలన్న ఆలోచన కేసీఆర్‌కు ఉన్నది. తెలంగాణ ప్రయోజనాలు, ఇక్కడి అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు సాగునీరు ఇస్తామని కేసీఆర్ అన్నారు.. దీనికి నిన్న, నేడు, రేపు ఎప్పటికి కట్టుబడి ఉంటాం అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ లేకుంటే, తెలంగాణ తేకుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడు.. ప్రతి అంశంలో తెలంగాణను కించపరిచి, తెలంగాణను అవహేళన చేసి మాట్లాడడం తగదు.. ఇదొక మానసిక రుగ్మత అనిపిస్తుంది. అఖిలపక్షంలో ప్రతిపక్ష పార్టీలను ఎందుకు పిలుస్తారు? ప్రభుత్వ ఉద్దేశం ఏంటో చెప్పాలి.. కానీ అధికారుల ముందు రాజకీయాలు ఎలా మాాట్లాడతారు? బనకచెర్ల ప్రాజెక్టు నేపథ్యంలో నాగార్జున సాగర్ కాలువలను వెడల్పు చేస్తున్నది.. ఇది రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకం.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా నిలదీయడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల గురించి అపెక్స్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదు? అపెక్స్ సమావేశం ఏర్పాటు చేయకుంటే ప్రాజెక్టులకు అనుమతులు ఎలా వస్తాయి? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి ఫీజబులిటీ లేకున్నా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగానే రూ.82 వేల కోట్లు ఖర్చయ్యే పథకానికి ఏకంగా 50 శాతం భరిస్తామని హామీ ఇవ్వడం దేనికి నిదర్శనం.. తెలంగాణ మీద బీజేపీకి ఉన్న కక్షకు ఇది నిదర్శనం.. ఇది తెలంగాణకు గొడ్డలిపెట్టు. కనీసం తెలంగాణను సంప్రదించాలన్న ఉద్దేశం కూడా కేంద్రానికి లేదు. నదుల అనుసంధానం కింద ఇది ఇంటిగ్రేట్ అవుతుందని ఏపీ కేంద్రాన్ని ఒప్పించుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం మీద తప్ప ప్రజాప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాల మీద ముందు చూపు లేదు. ఏ ప్రాజెక్టు, ఏ నది నుండి ఎంత నీళ్లు వస్తాయి అని పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌ను వదులుకున్నామని తెలంగాణ రైతాంగం భావిస్తున్నది. కానీ రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర ఈ సాగునీటి అవసరాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు.. మీడియా సమావేశంలో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు వారించరా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
నిజంగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అయితే ఇన్నేళ్లు మేము సాగునీళ్లు కోల్పోయినం అని అధికారంలోకి వచ్చిన మొదటిరోజే కేంద్రానికి నీళ్లను కేటాయించాలని లేఖ రాయాాల్సింది. గోదావరి నుండి బనకచర్లకు నీళ్లను తీసుకపోతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే కృష్ణా నది నుండి నీళ్లు తీసుకుపోతున్నందున ఇక మీదట కృష్ణా నది నుండి నీళ్లు తీసుకుపోవద్దని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఎందుకు లేఖ రాయడం లేదు? ప్రభుత్వానికి ఒక విధానం లేదా? ఇప్పటి వరకు తీసుకువెళ్తున్న నీళ్లను బంద్ పెట్టాలని ఎందుకు అడగడం లేదు? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు.