Niranjan Reddy | హైదరాబాద్ : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పికొడతారు అని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ అంశాల మీద అనేకసార్లు స్పందించారు.. ఆదానీ బొగ్గు విషయంలో గానీ, ఢిల్లీ నిరసనలో మరణించిన ఉత్తర భారత రైతుల కుటుంబాలను ఆదుకున్నది కేసీఆర్ మాత్రమే.. ఈ తరంతో పాటు, భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న పరిస్థితులకన్నా మెరుగైన జీవనం లభించే విధంగా పాలకుల చర్యలు ఉండాలి.. లేకుంటే చరిత్రలో వారికి స్థానం ఉండదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు అన్ని మీడియా సంస్థల వార్తలతోనే తేలిపోయింది. అయినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. యాసంగి కోతలు పూర్తయి వానాకాలం వచ్చినప్పటికి నెలల తరబడి కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. ధాన్యం కొనుగోళ్లలో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నా రైతుల అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. మిల్లర్లను ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు.. సీఎం ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు అంటే అసలు పాలన మీద పట్టుందా..? ప్రశ్నించిన వారిని దబాయిస్తున్నారు.. వారి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వ నిర్భంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిప్పికొడతారు అని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
కేసీఆర్ పాలనలో రైతులను వ్యవసాయం విషయంలో, పంటల సాగు విషయంలో ఇక్కడి వాతావరణ పరిస్థితులు వివరించి పంటల మార్పిడిని ప్రోత్సహించాం. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహించాం. 60 లక్షల ఎకరాలలో వరి సాగు నుండి 20 లక్షల వరకు ఇతర పంటల వైపు మల్లాలని చైతన్యం చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో 35, 40 వేలు ఎకరాలలో ఉన్న ఆయిల్ పామ్ సాగును 2 లక్షల ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగును పెంచాం. వంట నూనెల కోసం దిగుమతుల మీద ఆధారపడకుండా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తే లక్ష కోట్ల వరకు ఆదా అవుతుందని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ దేశ విశాల ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను కేంద్రానికి వివరించాం. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆపరేషన్ కగార్ ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు.