Niranajan Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి స్థానానికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు.. నిజంగా ఉరితీయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉరితీయాలి అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు, పచ్చబడ్డ తెలంగాణను ఎండబెట్టినందుకు, రూ.15 వేలు రైతుభరోసా ఎగ్గొట్టినందుకు, రూ.4000 వేల ఫించన్ ఇవ్వనందుకు, క్వింటాలుకు బోనస్ రూ.500 బోనస్ ఎగ్గొట్టినందుకు మీ ప్రభుత్వాన్ని ఉరితీయాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని ఇవ్వనందుకు మీ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఉరితీయాలి. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వనందుకు మీ ప్రభుత్వాన్ని ఉరితీయాలి అని నిరంజన్ రెడ్డి అన్నారు.
పదేళ్లలో పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పమంటారు.. తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేసిందే కేసీఆర్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి మీద, నీటి ప్రాజెక్టుల మీద, పరివాహక ప్రాంతాల మీద అవగాహన, చిత్తశుద్ది లేదు. పాలమూరులో నాలుగు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు వేసినా రూ.32,500 కోట్లతో పనులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మిగిలిన పనులు పూర్తి చేయకుండా రేవంత్ రెడ్డి ఏడాదిన్నరగా కాలయాపన చేస్తున్నారు.. పాలమూరు ఎత్తిపోెతల పనులను ఏ కారణం చేత ఎందుకు ఆపారో రేవంత్ ప్రజలకు చెప్పాలి. నీళ్లు లేని చోట కొడంగల్ ఎత్తిపోతల చేపట్టారు.. దాని భవిష్యత్తు ఏమవుతుందో వేచిచూడాలి అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ చేతగాని తనాన్ని, ఏపీకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వ వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద నెపం పెడుతున్నారు.. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా హర్షించరు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండడం పాలకుల లక్షణం.. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్, కేసీఆర్ పట్టుబడతారు అని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.