హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ దుష్టపాలనతో పాలమూరు జిల్లా ప్రజలకు వలపోతే మిగిలింది. ఆ పార్టీ వల్లే వలసల జిల్లాగా మారింది’ అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వల్లే పాలమూరు ఉమ్మడి జిల్లా పచ్చపడింది.. బాగుపడింది.. అని తేల్చి చెప్పారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్లలో పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ పోరాటానికి సిద్ధమైనందుకు ధన్యవాదాలు తెలిపారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తొలుత ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునే చేపట్టిందని సీ లక్ష్మారెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ హయాంలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. కానీ కాంగ్రెస్ పాలకులు ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపడానికి అనేక కుట్రలు చేశారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూసేకరణ జరుగుతుంటే, మరోపక్క ఈ కాంగ్రెస్ నాయకులే రైతులను రెచ్చగొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. మూడోసారి బీఆర్ఎస్ సర్కారు వచ్చి ఉంటే నార్లాపూర్, ఏదుల, కరివెన, వట్టెం ప్రాజెక్టులు నీళ్లతో నిండి ఉండేవని తెలిపారు. కానీ, నిస్సిగ్గుగా కాంగ్రెస్ దద్దమ్మలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేంద్రానికి తలొంచిన రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎండపెట్టిందని లక్ష్మారెడ్డి విమర్శించారు. 90 టీఎంసీలకు బదులుగా 45 టీఎంసీలే ఇస్తానన్న కేంద్రం సూచనకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తలవంచిందని లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదని ఆరోపించారు. అసలు పాలమూరు జిల్లాను భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ కదా! అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిక్క మాటలు కట్టిపెట్టి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో 40 శాతం బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచారని, దమ్ముంటే పరిషత్ ఎన్నికలు వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చారని, ఆయన ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెసోళ్ల కండ్లు ఎర్రబడ్డయి: శ్రీనివాస్‌గౌడ్
కేసీఆర్ వచ్చాకే పాలమూరు జిల్లా పచ్చబడిందని, దీన్నిజూసి కాంగ్రెసోళ్ల కండ్లు ఎర్రబడ్డాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ కుప్పకూలి మనుషులు చనిపోతే ఇప్పటివరకు వారి మృతదేహాలను కూడా బయటకు తేలేకపోయారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుల కోసం రూ.7,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సిన 7 అనుమతులు బీఆర్ఎస్ హయాంలో వచ్చినవేనని గుర్తుచేశారు. తెలంగాణ హక్కుల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్న బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.