Koppula Eshwar | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల మాటలకు చేతలకు పొంతన లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు.
సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ గురుకులాల పరిస్థితి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయంలోనే గురుకులాల పరిస్థితి బాగాలేదని చెప్పడం హాస్యాస్పదం. సీఎం నియోజకవర్గంలో ఉన్న గురుకుల పాఠశాలను సందర్శిద్దామా..? పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడే తేలుద్దాం. గురుకులాల్లో ప్రతి రోజు ఏదో ఒక ఘటన జరిగి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మణ్ కుమార్ నిన్న గాక మొన్న మంత్రి అయ్యారు. ఆయన అహగాహన లేమితో మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయంలో గురుకులాల సంఖ్య 1024కు పెంచాం. దాదాపు ఆరులక్షల మందికి గురుకుల విద్య లభిస్తోంది. వివిధ రాష్ట్రాల అధికారులు, నేతలు కేసీఆర్ హయంలో గురుకులాల గొప్పతనాన్ని తెలుసుకునేందుకు తెలంగాణకు వచ్చి వెళ్లారు అని కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.
22 నెలల కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల దీనావస్థల గురించి సీఎంకు, మంత్రికి పట్టింపు ఉందా..? తన ధర్మపురి నియోజక వర్గంలో గురుకుల భవనాన్ని పూర్తి చేయని అసమర్థ మంత్రి లక్ష్మణ్ కుమార్. ఏనాడైనా గురుకులాలపై సీఎం, మంత్రి సమీక్ష చేశారా..? గురుకులాలకు పక్కా భవనాలు కేసీఆర్ హయంలో నిర్మించలేదు అనేది అబద్దం. కట్టిన పక్కా భవనాలు నేను మంత్రికి చూపిస్తా.. సిద్దమేనా..? గురుకులాల్లో విద్యార్థుల మరణాలు రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ చేసిన హత్యలే. కనీసం విద్యార్థులకు తిండి పెట్టని అసమర్థ ప్రభుత్వం ఇది. వాస్తవాలు ఎదుర్కునే దమ్ము లేకే మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి లక్ష్మణ్ కుమార్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మా ప్రశ్నలకు జవాబు చెప్పు. మీతో చర్చకు హరీష్ రావు అవసరం లేదు అని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రెండేళ్లుగా డ్రామా నడుపుతున్నారు. ఇప్పటి వరకు ఓ భవనం పూర్తి చేసింది లేదు. ఒక్కరిని చూసి ఇంకొకరు అబద్దాలు ఆడటం నేర్చుకున్నారు. సీఎం మెప్పు కోసం లక్ష్మణ్ కుమార్ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. గురుకుల విద్యార్థులే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా..? గురుకులాల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరచి గురుకులాల స్థితిగతులు మెరుగుపరచాలి. ఊహల్లో ఊరేగుతూ కేసీఆర్పై అనవసర విమర్శలు చేస్తున్నారు. వాటిని మానండి అని కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.
గురుకులాల్లో జీవో 17 తెచ్చి 9 వేల మంది చిన్న కాంట్రాక్టర్ల పొట్ట గొట్టారు. ఐదారు నెలలుగా వారికి బిల్లులు ఇవ్వకపోగా ఇపుడు వారి సేవలనే వద్దనుకుంటున్నారు. స్కూళ్ళు, గురుకులాల్లో కోడి గుడ్ల ధర పెంచి 600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఇందులో మంత్రి లక్ష్మణ్ కుమార్ వాటా ఎంతో చెప్పాలి. బెస్ట్ ఎక్సెలెన్స్ స్కూళ్లలో అడ్మిషన్లు ఎందుకు తగ్గాయో చెప్పాలి. నీకు మంత్రి పదవి వస్తే చాలా లక్ష్మణ్ కుమార్? విద్యార్థుల బాగోగులు పట్టవా..? గురుకులాల్లో చనిపోయిన 110 మంది విద్యార్థుల జాబితా ప్రభుత్వానికి పంపుతున్నా.. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించే తీరిక మంత్రికి లేదా. కేసీఆర్, హరీష్ రావుపై విమర్శలు చేస్తే పెద్ద వాడివై పోవు లక్ష్మణ్ కుమార్. ఇప్పటికైనా మంత్రినని సోయి తెచ్చుకుని పని చేయ్ అని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.