Koppula Eshwar | వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టేందుకు కిషన్‌రెడ్డికి బొగ్గు మంత్రిత్వశాఖ పదవిని ప్రధాని మోదీ ఇచ్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకున్నారని తెలిపారు. స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారన్నారు. సింగరేణి విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని నమ్మించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు విఫల ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ కొంగుబంగారం సింగరేణి సంస్థ అని, అది కేవలం ఒక కంపెనీ కాదని తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అన్నారు. దక్షిణ భారతానికే వెలుగురేఖ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆరుజిల్లాల్లో విస్తరించి ఉన్న సంస్థ సింగరేణి అన్నారు. లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చిన సంస్థ అన్నారు.
అనేక పరిశ్రమలకు ఈ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డ సంస్థ సింగరేణి అన్నారు. 133 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థలో లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రముఖంగా నిలిచిన సంస్థ సింగరేణి అన్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నిర్వహిస్తూ ఒకనాడు తీవ్రమైన నష్టాల్లో ఉన్నటువంటి కార్మికులు, యాజమాన్యం సమష్టి కృషితో అనేక సంవత్సరాలుగా లాభాలను ఆర్జించిన సంస్థ సింగరేణి అన్నారు. గత సంవత్సరంలో కూడా 32శాతం లాభాల వాటాను శ్రామికులకు అందించిన సంస్థ సింగరేణి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ సింగరేణి సంస్థ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కూడా ప్రైవేటుపరం చేయాల్సి దుర్మార్గమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. ఎప్పుడైనా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం, వేలం వేయడం చేస్తామన్నారు.
ఇక్కడ లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థలను ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు గనులను ఆయా ప్రభుత్వాల విన్నపం మేరకు ఆ రాష్ట్రాలకే వదిలి వేయడం జరుగుతుందని.. ఒడిశా, తమిళనాడు గుజరాత్, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే వదిలివేయాలన్నారు. గతంలో నుంచి కోరడం జరుగుతుందని.. తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన ఏ ఒక్క బొగ్గు గనిని కూడా ప్రైవేట్ పరం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిన నాయకుడు కేసీఆర్ అన్నారు. మెడపై కత్తిపెట్టినా వేలం జరగకుండా అడ్డుకున్నదని.. సింగరేణి బలపడితే కార్మికులు బలపడతారన్నారు. సింగరేణి బలపడితే రాష్ట్రం బలపడుతుందన్నారు. అయినప్పటికీ మన ప్రధాని నరేంద్ర మోదీ నిన్నగాక మొన్న బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
దేశంలో ఉన్న అనేక గనులతో పాటు సింగరేణి బొగ్గు గనులను కూడా వేలం వేయడానికి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం పెట్టి దుర్మార్గమైన కొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్నారన్నారు. వేలంపాట ద్వారా గనులు కేటాయించవద్దంటూ 8 డిసెంబర్ 2021న కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్రానికి 51శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉందని చెప్పారు. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టడానికే కిషన్ రెడ్డికి బొగ్గు శాఖ మంత్రి పదవి ఇచ్చినట్టున్నడు మోదీ అంటూ విమర్శించారు. రేపు జరిగే 90 బొగ్గు బావుల వేలంలో సింగరేణి సంబంధించిన శ్రావణపల్లి కూల్ బ్లాక్ కూడా ఉందని.. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చేస్తున్న కుట్ర అని విమర్శించారు. రాష్ట్రం నుంచి ఒకరు కేంద్రమంత్రి అయితే మనకు ఏదైనా ప్రాజెక్టు రావాలని.. ఉన్నది అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.