Koppula Eshwar | కాంగ్రెస్ పాలనలో హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గ్రెస్ ఏడునెలల పాలనలో ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో 36 మంది విద్యార్థులు మృతి చెందారన్నారు. 500 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలయ్యారన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆదివారం విద్యార్థి విద్యుత్ షాక్కు గురయ్యాడన్నారు. విద్యార్థుల మరణాలపై సీఎం, మంత్రులు, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.
36 మంది విద్యార్థుల మరణాలకు రేవంత్రెడ్డి సర్కార్ కారణం కాదా? అంటూ ప్రశ్నించారు. గురుకులాల్లో పేద పిల్లల ప్రాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రక్షణ లేదని.. నాసిరకమైన భోజనాన్ని పిల్లలకు పెట్టడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారన్నారు. హాస్టల్స్లో పాములు, ఎలుకలు ఉండడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యావ్యవస్థ రేవంత్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లల సంక్షేమం ఎవరికీ పట్టనట్టుగా ఉందన్నాన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల పాఠశాలల్లో చదువుకునేందుకు అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కలిపి 1,022 గురుకులాలను నెలకొల్పిందని.. అందులోనూ అత్యంత వెనకబడిన, అనాథ బాలలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలుచేసి విద్యాప్రవేశాలను కల్పించిందన్నారు.
డిగ్రీ వరకు ఉచితంగా ఉన్నతవిద్యను అందించిందన్నారు. అట్టడుగువర్గాల్లో అక్షరకాంతులను నింపుతూ, నవ, విద్యాతెలంగాణ నిర్మాణానికి బాటలు వేసిందన్నారు. గతంలో తాను ఐదేండ్ల పాటు ఎస్సీ వెల్ఫేర్ మంత్రిగా పని చేశానని.. చాలా ఏండ్ల పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారన్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండేదని.. అత్యంత నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఫలితాలు కూడా అద్భుతంగా వచ్చాయని కొప్పుల ఈశ్వర్ తెలిపారన్నారు. కానీ, కేసీఆర్ పరిపాలనలో గురుకుల పాఠశాలల్లో పిల్లలకు అన్ని వసతులు కల్పించడంతో పాటు గురుకులాల్లో చదువుకునే ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షలు ఖరు చేసి ఉన్నత విద్యను అందించామంటూ కొప్పుల ఈశ్వర్ గుర్తు చేశారు.