హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ దేశంలో కేవలం మూడు రాష్ర్టాల్లోనే అధికారంలో ఉన్నదని, దానికి అంత మిడిసిపాటు ఎందుకని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఒక ఎన్నికలో కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ చచ్చిపోయిందని అంటవా? అని సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనని సీఎం అనడం ఓటర్లను అవమానించడమేనని అభ్యంతరం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రం ఎదురొంటున్న సమస్యలను వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేయాలని బండి సంజయ్ పిలుపు ఇవ్వలేదా? అని నిలదీశారు. రైతుల బాధలు రేవంత్‌కు పట్టడం లేదని, ఇప్పటివరకు రైతుబంధు నిధులు జమ కాలేదని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కేసీఆర్‌ను బద్నామ్ చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని, పరిపాలన చేత కాక అనవసర విషయాలు తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. హామీల గురించి అడిగితే కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తున్నదని మండిపడ్డారు. కేటీఆర్ ప్రజల పక్షాన మాట్లాడితే కాంగ్రెస్ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.