పెద్దపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది.. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపురేఖలు మార్చిన కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నరు. బీఆర్ఎస్ను నామరూపాల్లేకుండా చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుపై నిందారోపణలు చేస్తున్నరు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పార్వతి బరాజ్ నుంచి కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చి జలాభిషేకం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు రిపేర్లు రావడం సహజమని అన్నారు. రాష్ట్రంతోపాటు దేశంలో అనేక ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి ప్రజలకు సాగు, తాగునీటిని అందించిన చరిత్ర ఉన్నదని సూచించారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కుంగిపోతే వాటిని రిపేర్ చేసి నీళ్లివ్వకుండా.. కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు నిజాలను నిర్భయంగా తెలియజేశారని తెలిపారు.