Jagadish Reddy | గెలుపోటములు అనేవి కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో పుస్తక ప్రదర్శన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు తన గురించి తాను చెప్పుకోవడం ఇష్టముండదన్నారు. కేసీఆర్ గొప్ప గురించి సరిగా చెప్పకపోవడం మన తప్పేనన్నారు. ఇక్కడ లిల్లీ ఫుట్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ చరిత్రలో సీఎం పదవి అనేది చాలా చిన్నదని.. సీఎం పదవి కేసీఆర్ కాలిగోటికి సమానమని.. కేసీఆర్‌కు తెలంగాణ తెచ్చిన యోధుడిగానే చూడడానికి నేను ఇష్టపడతానన్నారు. నాగార్జున సాగర్‌కు కిందకు జరిపిన ఆయనకు ఆంధ్రావాళ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారన్నారు. కేసీఆర్ ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధిస్తే ఆయనకు ఇక్కడి పార్టీలు ఇచ్చిన గౌరవమేమిటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ మీద కూడా ఎన్నికల్లో పోటీపెట్టడం బాధాకరమైన విషయమన్నారు. కేసీఆర్‌కు ఇక్కడి రాజకీయ పార్టీలు ఇచ్చిన గౌరవాన్ని చూసి బాధపడ్డానన్నారు.
కొందరు కేసీఆర్‌పై రాసేందుకు ఎందుకు బిడియపడుతున్నారో చెప్పాలన్నారు. మార్క్స్, లెనిన్ గురించి చెప్పే వారు.. కేసీఆర్ గురించి ఎందుకు చెప్పడం లేదన్నారు. కేసీఆర్ ఏం చేసినా యజ్ఞంలా చేశారన్నారు. కేసీఆర్ ఉద్యమ పిచ్చి.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ అభివృద్ధి పిచ్చి.. మిగతావి ఏవీ కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదన్నారు. రాజకీయాలను కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదని.. మన నాయకుడి గురించి మనం రాసుకోవడానికి ఇబ్బంది ఏంటీ అన్నారు. ఒకే భాష మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. గెలుపు, ఓటములు కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవని.. కేసీఆర్ పద్నాలుగేళ్ల పోరాటం ప్రతి రోజూ ఒక పుస్తకం రాయొచ్చన్నారు. సార్ దృష్టిలో 2009 డిసెంబర్ 9నే తెలంగాణ వచ్చిన రోజు అని.. అప్పట్నుంచే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రణాళికలు రచించారన్నారు. అప్పుడు కొందరు నవ్వుకున్నారని.. అప్పుడు కేసీఆర్ వేసుకున్న ప్రణాళికలు రాష్ట్రం వచ్చిన తర్వాత అమలయ్యాయన్నారు.