తిరుమలగిరి, ఫిబ్రవరి 16 : రాష్ట్రంలో విచిత్రమైన పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కేసీఆర్‌ను చూసి భయపడుతున్నదని, అందుకే రేవంత్‌రెడ్డితో చేతులు కలిపిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, కేటీఆర్‌పై పెట్టిన కేసులు పనికిమాలినవి అని వాటిలో పసలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని, కాంగ్రెస్‌కు బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
సోమవారం కూడా చాలాచోట్ల కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులు, కిడ్నాప్‌లు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలని, ఆ రెండు పార్టీలు చేతులు కలిపి, మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల పొత్తులు పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ర్టాన్ని దోచుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నిదాడులు చేసినా, కేసులు పెట్టినా తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, వచ్చేది తమ ప్రభుత్వమేనని ఇప్పటికే జనం నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. తిరుమలగిరి మున్సిపాలిటీలో గులా బీ జెండా ఎగిరిందని, సగానికి పైగా నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీలు గెలుచుకున్నామని తెలిపారు.