Jagadish Reddy | ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపేందుకు వీలు లేదన్నారు. రైతు భరోసా పేరుతో రూ.15వేలు ఇస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటీ? అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతుబంధు రైతుకు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వమన్నారు.
పింఛన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. విద్యుత్ బిల్లుల మాఫీ రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. కేబినెట్ సబ్ కమిటీ రైతులను మోసం చేయడానికి వేసిన కమిటీ అంటూ ఆరోపించారు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో అలాగే ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమయ్యేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయన్నారు. వీధికుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉందా? లేదా? అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోను శాంతిభద్రతలు బాగా లేవని.. ప్రభుత్వం లీకులు తప్ప ఒక్క హామీని నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫీయా నదులను తోడేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దారి దోపిడీ లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
విద్యుత్ కమిషన్ నుంచి తనకు లేఖ వచ్చిందన్నారు. లేఖ అందిన వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని కోరారన్నారు. విద్యుత్ కమిషన్‌కు తనవద్ద ఉన్న పూర్తి సమాచారం ఇస్తానన్నారు. వాంగ్మూలంలో తప్పులను బయటపెడతానన్నారు. అందరినీ విచారిస్తేనే కమిషన్‌కు సమగ్ర సమాచారం వస్తుందన్నారు. మాజీ సీఎం రమన్ సింగ్, విద్యుత్ అధికారుల నుంచి సైతం కమిషన్ సమాచారం తీసుకోవాలన్నారు. ఈఆర్సీపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని.. ఎన్జీటీని విచారణకు పిలుస్తారా? అంటూ ప్రశ్నించారు.
పర్యావరణ అనుమతులు ఇచ్చిన వారిని విచారణకు పిలుస్తారా? అని ప్రశ్నించారు. అందరినీ విచారణకు పిలువకపోతే సమగ్ర విచారణకు కిందకు రాదన్నారు. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత రూ.6వేలకోట్ల నష్టం జరిగినట్లుగా సమాచారాన్ని ప్రజలకు తెలిపారన్నారు. సమాచారాన్ని తెలిపిన వారిని కమిషన్ చైర్మన్ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. కమిషన్ ఏర్పాటు చేసి లీకులు ఇస్తే.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లేనన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై విచారణ జరపాలని.. లేకపోతే కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరతామన్నారు.