హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ) : ఎన్నికలప్పుడు వరంగల్‌లో కాంగ్రెస్ చేసిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలుతెప్పలుగా వస్తున్నా, ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు. మిల్లుల వద్ద కూడా బస్తాకు కిలో, రెండు కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతులు ఎండకు మలమలా మాడిపోతున్నా.. ప్రభుత్వానికి సోయి లేదా? అని నిలదీశారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సర్కార్ పాపం.. రైతులకు శాపం
కొనుగోలు కేంద్రాల వద్ద పొద్దు తిరుగుడు పువ్వు రైతుల 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు గట్టిగా నిలదీశారు. కేంద్రం పావు వంతు మాత్రమే కొనుగోలు చేసిందని, మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు. శనగ రైతుల పాలిట సర్కార్ విధానాలు శనిలా మారాయన్నారు.
మద్దతు ధర లేక జొన్న రైతులకు నష్టం
జొన్న కొనుగోలు ఇంకెప్పుడు ఏర్పాటుచేస్తారని హరీశ్‌రావు నిలదీశారు. కనీస మద్దతు ధర రూ. 3,371 ఉంటే, కేవలం రూ.2,500కే ప్రైవేట్‌కు అమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. ఎకరాకు 26.50 క్వింటాల్లే కొంటామనే నిబంధనను సడలించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 30 నుంచి 40క్వింటాళ్ల మకజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎకడ అమ్ముకోవాలి? అని ప్రశ్నించారు. తక్షణమే అన్ని పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాడుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు.