Harish Rao | హైదరాబాద్ : కృష్ణా నదిలో నీటి వాటాపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్దపు ప్రచారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణాలో 299:512 టీఎంసీల ద్రోహం కాంగ్రెస్ పార్టీదే అని ధ్వజమెత్తారు. 299 టీఎంసీలకు బీఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవరైనా అంటే నాలుక చీరేస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణకు పట్టిన అబద్దాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. అబద్దాల వైరస్‌కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా ఉందన్నారు హరీశ్‌రావు. బయట వాళ్లకు సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలు వేస్తున్నడు రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధించింది కేసీఆర్, సెక్షన్ 3 సాధించి కృష్ణాలో నీటి వాటా సాధించేందుకు కృషి చేశారు కేసీఆర్. 299:512 హక్కుల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టిండు అని చూపిస్తవా, నేను పదవికి రాజీనామా చేస్తా అని సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు సవాల్ విసిరారు.
గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, కృష్ణాలో 299:512 ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే కదా..? 2013 నవంబర్ 18న నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు. తెలంగాణకు కృష్ణాలో 299, ఏపీకి 512 ఇచ్చినం అని ఉంటుంది. ఎవరు మరణ శాసనం రాశారు తెలంగాణ నీటి హక్కులకు.
మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది. అన్ని డ్యాక్యుమెంట్లు విడుదల చేసేందుకు నేను సిద్దం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
తెలంగాణ నీటి హక్కులు కాపాడంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని చేతులెత్తి మొక్కుతున్నా. అడ్ హక్కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. 2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో ఉంటుంది. మీ ముద్దుల అడ్వైజర్ ఆదిత్యానాథ్ సంతకం పెట్టిండు. ఆయనే ఇప్పుడు నీ అడ్వైజర్. తెలంగాణ హక్కులకు ఆనాడు వ్యతిరేకంగా మాట్లాడిండు. తెలంగాణ హక్కులను కాలరాసిన వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నవు. బాబు చెప్పు చేతుల్లో ఉన్నవా, తెలంగాణకు పని చేస్తున్నవా. గురుదక్షిణ చెల్లించాలనే తపనే తప్ప నీకు తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టవు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించాలని జోషి అంటే, లేదు లేదు అప్పగించాలని చెప్పిన వ్యక్తి ఆదిత్యా నాథ్ దాస్. అలాంటి వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నడు. ఈ తాత్కాలిక ఒప్పందంపై సంతకం ఎవరు పెట్టారు మీ సలహాదారుడు.
కానీ రేవంత్ రెడ్డి నేను పెట్టిన, కేసీఆర్ పెట్టిండు అంటుండు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరినం. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది. 299 కాక, 581 టీఎంసీలు మాకు కావాలని, ఈ లెక్కంత తేలాలంటే ట్రిబ్యునల్ వేసి పంచాలని 22 పేజీల లేఖ రాసినం. 299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం. తాత్కాలిక ఒప్పందాన్ని చూపి శాశ్వత ఒప్పందం అని అబద్దాలు చెబుతున్నడు రేవంత్ రెడ్డి. 299 లెక్కుకు ద్రోహి ఆదిత్యానాథ్ దాస్, అయన పెట్టిందే ఈ రాచపుండు. ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ 2016లో చెప్పినం. రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అడిగితే షెకావత్ సుప్రీం కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిండు. అప్పుడు కేసు విత్ డ్రా చేసుకొని, సెక్షన్ 3ని సాధించింది బిఆర్ఎస్. 299 శాశ్వత ఒప్పందం మేము చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాము, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాము, ఎందుకు సుప్రీంకు పోయాము. సెక్షన్ 3పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయి. 2025లో ఈ ఏడాది 763 టీఎంసీలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ అమాయక చక్రవర్తి 500 టిఎంసీలు చాలు అని అన్నడని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.