Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. శాఖల వారీగా లెక్కలు చెప్పేందుకు నేను సిద్ధం. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఐయామ్ రెడీ.. ఉద్యోగాల భర్తీపై ఒక రోజు అసెంబ్లీలో చర్చ పెట్టు. ఒక లక్షా 62 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. డిపార్ట్మెంట్ల వారిగా లెక్క చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేసీఆర్ సాధించిన గొప్ప విజయం 95 శాతం లోకల్ రిజర్వేషన్రు. ఇవాళ గ్రూప్-1, 2, 3 పోస్టుల భర్తీలో అచ్చంగా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితం. కేసీఆర్ దూరదృష్టితో చేసిన ఫలితం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవాళ నువ్వు 57 వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటవు. అసలు నువ్వు ఇచ్చింది ఆరేడు వేలు మించదు. కేవలం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చిండు.. ఉద్యోగాల కల్పన విషయంలో రేవంత్ రెడ్డి బోగస్ మాటలు మాట్లాడుతున్నరు. నువ్వు, రాహుల్ గాంధీ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఏమయ్యాయి ఈ రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీతో చెప్పించి ఎగ్గొట్టినందుకు క్షమాపణ చెప్పు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్ లెస్ క్యాలెండర్‌గా మార్చినవ్. ఇందుకు నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పు. ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేయమని కోరితే నిరుద్యోగుల వీపులు కమిలేలా పోలీసులతో కొట్టించావు కదా..? ఇదేనా నీ ప్రజాపాలన. ఇప్పుడు నువ్వు, రాహుల్ గాంధీ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్దాం పదా.. గన్మెన్లు లేకుండా వెళ్లు.. ఎవరి వీపులు పగులగొడుతారో తెలుస్తది. నిరుద్యోగ యువతను ధర్నాలు చేస్తే, నిన్ను ప్రశ్నిస్తే కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు అని అవమానపరిచావు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా? వందేళ్ల ఓయూలో ఇలాంటి ఆంక్షలు ఎన్నడూ లేవు. ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలనా? అని హరీశ్‌రావు నిలదీశారు.