Harish Rao | గుమ్మడిదల, జూలై 16 : మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు భూబాధితులకు హామీ ఇచ్చారు. గుమ్మడిదలలోని 157 ఎకరాల అసైన్డ్ భూమిని ఇండస్ట్రీయల్ పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికోసం జిల్లా, మండల రెవెన్యూ అధికారులు రైతుల జాబితాను సిద్ధం చేశారు. గతంలో ఆర్డీవో, తహసిల్దార్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాన్ని సేకరించారు. రైతులకు న్యాయపరంగా రావలిసిన పరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కాగా ఇటీవల భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ. 15 లక్షలు ఇస్తామని అధికారుల నుంచి సమాచారం రావడంతో రైతులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న గుమ్మడిదల మండలంలో భూములకు మంచి ఖరీదు ఉందని ఎకరానికి సుమారుగా రూ.4 నుంచి 5 కోట్ల రూపాయాలు పలుకుతున్న భూములకు రూ.15 లక్షలు, ఇండ్ల స్థలానికి మూడు వందల గజాల భూమిని ఇస్తామని అధికారులు అంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి గుమ్మడిదల రైతులతో బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి వివరించారు. అంతే కాకుండా ఈ భూముల్లో గత కొన్ని దశాబ్దాలుగా రైతుల వినియోగంలో ఉన్నప్పటికి, రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదని, ప్రభుత్వం సేపట్టిన భూసేకరణలో వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు.
ఈ అంశంపై స్పందించిన మాజీ మంత్రి హరీష్‌రావు సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించి సమస్యకు తగిన పరిష్కారం తీసుకరావడానికి కృషి చేస్తానని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరితో పాటు జిన్నారం మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్, నాకులు చంద్రారెడ్డి, సూర్యనారాయణ, ఆంజనేయులు యాదవ్ తదితరులు ఉన్నారు.