Harish Rao | హైదరాబాద్ : ప్రజా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు… కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్‌కు అదనపు సమాచారం అందించిన తర్వాత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ద్రోహానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ. వందలాది మంది ద్రోహులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్. తెలంగాణను ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు వదిలిపెట్టి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అజ్ఞానం, అహంకారంతో రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. 299:512 శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే అబద్దం చెప్పడం సిగ్గుచేటు. తాత్కాలిక నీటి వినియోగం, నీటి పంపకానికి తేడా తల్వకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నీటి వినియోగం కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం ఆ ఏడాదికి మాత్రమే పరిమితం, నీటి పంపకం శాశ్వతమైంది. శాశ్వతంగా పంపిణీకి సంతకాలు పెట్టామని చెప్పడం పచ్చి అబద్దం అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ పాలకులు ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వంటి చేతగాని నాయకుల వల్ల, పెదవులు మూసుకోవడం వల్ల 299 మనకు కేటాయించడం జరిగింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు, అది శాసన సభ రికార్డుల్లో కూడా ఉంది. ఆనాటి కాంగ్రెస్ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి ఇచ్చిన నివేదికలోనూ గోదావరిలో 968, కృష్ణాలో 299 టిఎంసీలు కేటాయించిన విషయం చెప్పారు. గోదావరిలో 968 టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ అని గొప్పలు చెబుతున్న రేవంత్ రెడ్డి, కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసిన విషయం ఎందుకు దాచి పెడుతున్నావు. పదో తరగతి పిల్లవాడిని అడిగినా చెబుతారు.. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే, సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతారు. నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నదిలో పున: పంపిణీ చేయాలని ఎందుకు అడిగారు. రాష్ట్రం ఏర్పడిన 42వ రోజునే ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్ళు పంపిణీ చేయండి, 299 ఇచ్చి అన్యాయం చేసారు, 68శాతం నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి వాటా ఇవ్వాలని కేసీఆర్ అడిగారు. సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఉమా భారతిని కలిసారు, నితిన్ గడ్కరి, షెకావత్ , ప్రధానిని కలిసారు. సుప్రీం కోర్టు గడప తొక్కి, నిర్విరామ పోరాటం చేసి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తది, ఆ ట్రిబ్యునల్ సాధించింది కేసీఆరే రేవంత్ రెడ్డి గారూ.. ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం న్యాయవాదులు, ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తున్నది. దానిపై దృష్టి పెట్టండి. ఇదే రేవంత్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యింది. 299 టీఎంసీలు చాలని 2025లో ఉత్తమ్, రేవంత్ సంతకాలు పెట్టుకొని వచ్చారు. 299 టీఎంసీలకు మీరెందుకు సంతకాలు పెట్టారు? అని హరీశ్‌రావు నిలదీశారు.
కొద్ది నెలల్లో కృష్ణాలో మంచి వాటా రాబోతున్నది. అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్దితో నడుచుకో రేవంత్ రెడ్డి. అజ్ఞానం అని రేవంత్ ను బాధతో అంటున్న. గోదావరిలో 1000, కృష్ణాలో 500 ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇచ్చిండు. ఇది అజ్ఞానం కాదా. గోదావరిలో మన వాటా 1000 కాదు, 2918 కావాలని కేసీఆర్ అడిగారు. ఇదే విషయం బయట పెడితే నాలుక కరుచుకున్నరు. అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మాత్రమే కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అజ్ఞానిలా మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి మన నీటి హక్కుల గురించి తెలవక పోవడం బాధాకరం. కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తుంటే, ఉత్తమ్ మొన్న 573 టీఎంసీలు చాలు అని అన్నడు. రేవంత్, ఉత్తం మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పినట్లు పని చేస్తున్నరా, రాష్ట్రం కోసం పని చేస్తున్నరా..? గోదావరి, కృష్ణాలో 1000, 500 టీఎంసీలు చాలు అనడం అజ్ఞానంతో మాట్లాడిన మాటలు. బాగా చదువుకొని, ఇంజినీర్లతో మాట్లాడి తెలుసుకొండి. బేసిన్ల గురించి తెల్వని ఆయన సీఎం అయ్యిండు, బేసిక్స్ తెల్వని ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అయ్యండు. నేనే వాదనలు వినిపించిన అనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మాత్రం తెల్వదా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.