Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి టెక్నికల్‌గా కాంగ్రెస్ సీఎం.. కానీ హృదయం ఇంకా తెలుగు దేశం పార్టీలోనే ఉందని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
బాసన్ల గురించి తెలిసినంత సులువు కాదు, బేసిన్ల గురించి తెలుసుకోవడం అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్లు ఉంది రేవంత్ తీరు. బనకచర్ల మీద బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు. బ్యాగులు మోసి బ్యాడ్ మెన్‌గా పేరు తెచ్చుకున్నడు. బనకచర్ల కోసం బొంకు మెన్‌గా మారిండు. టెక్నికల్‌గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ, హృదయం ఇంకా తెలుగుదేశంలోనే ఉంది. స్కూల్ ఏజ్, కాలేజ్ ఏజ్‌లో ఉన్న చంద్రబాబుతో నీ అనుబంధం మరిచిపోవడం లేదు.
జులై 6, 2024 నాడు ప్రజా భవన్‌కు చంద్రబాబును పిలిచి విభజన హామీల ముసుగులో గోదావరి బనకచర్ల మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 13, 2024 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా విజయవాడలో చంద్రబాబును కలిసి బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు చెప్పి వచ్చిండు. ఈక్రమంలోనే.. నవంబర్ 15, 2024 నాడు ఏపీ-జీబీ లింక్‌కు సహకరించాలని నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఆ తర్వాత వెంటనే డిసెంబర్ 31, 2024 నాడు నిర్మలకు మరో లేఖ. 80 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
గోదావరి నీళ్ల తరలింపు కుట్రలు జరుగుతుంటే తనకేం తెలియనట్లు మౌనంగా ఉన్నడు, నటించిండు రేవంత్ రెడ్డి? ఈ చీకటి అధ్యాయం బయటపడదు అనుకున్నడు. మాకు రేవంత్, బాబు కుట్రలు తెలియగానే నిలదీశాం. జనవరి 24, 2025 నాడు మొట్ట మొదట నేను తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అడిగిన. గడ్డి పీకుతున్నరా అని ప్రశ్నించిన. అప్పుడు నిద్ర లేచి జనవరి 22వ తేదీతో రాసినట్లు లేఖ సృష్టించి మీడియాకు విడుదల చేశారు. జూన్ 14, 2025 నాడు నేను పీపీటీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అదే రోజు పాత డేట్ వేసి లెటర్ విడుదల చేశారు. అసలు గోదావరి బనకచర్ల మీద పోరాడింది బిఆర్ఎస్, కర్రు కాల్చి వాత పెట్టింది బిఆర్ఎస్ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
అపెక్స్ కమిటీ మీటింగ్‌లో బనకచర్ల అనే పదం ఉందా..? రేవంత్ రెడ్డి ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవు. ఒక్క పేరా చదివి ఎజెండా 5లో చెప్పిన అంశాలను ఎందుకు చదవలేదు. వరద జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలు ఉపయోగపడే విధంగా, ఆమోదయోగ్యంగా వాడుకునేందుకు సంప్రదింపులు చేసుకోవాలని ఉంది. అంతే గాని అందులో బనకచర్ల అని ఉందా, నీళ్ళు తరలించుకుపో అని ఉందా.. ఎందుకు ఇంత చిల్లరగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, అది ముందుకు పడలేదు. ఇప్పుడు ముందుకు ఎలా పోతున్నది. బాబును ప్రజా భవన్ పిలించిండు, ఉత్తమ్ బెజవాడ పోయి బజ్జీలు తిని అమోదం తెలిపిండు. ఎజెండా 5లో తెలంగాణ అనుమతి లేకుండా నీళ్ల డైవర్షన్‌కు ఒప్పుకునేది లేదని చెప్పిండు కేసీఆర్. నువ్వు రాసిన పీపీటీలోనే బనకచర్ల అనేది లేదు. నువ్వు హెడ్డింగ్ కావాలని 2016 గోదావరి పెన్నా అనుసంధానం అని పెట్టినవు. ఇంత చిల్లరగా, ఇంత చిచోరగా ఉన్నవు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు వాస్తవాలు బట్టబయలు చేస్తం. మైక్ కట్ చేయకు, కెమెరా తిప్పకు అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.