Harish Rao | హైదరాబాద్ : మందిని తొక్కడం.. మాట తప్పడం రేవంత్ రెడ్డి నైజం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని చేయడు ఈ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
సీఎం గంటన్నర సేపు ప్రెస్ మీట్ చూసినవారికి రేవంత్ రెడ్డి మానసిక స్థితిపై సందేహం కలుగుతుంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫలించకపోవడంతో ఆ ఫ్రస్టేషన్లో గంటన్నరసేపు అడ్డమైన చెత్త వాగాడు. ఈ ప్రభుత్వం నడపడం మాకు చేతకావడం లేదని ముఖ్యమంత్రి మాటల్లో తేలిపోయింది. రేవంత్ రెడ్డి తన అసమర్థతను చెప్పకనే చెప్పుకున్నాడు.. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగాడు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలన చూసి ఓటేయమని అడిగారు. ఆనాడు టీడీపీలో ఉండి వైఎస్సార్ పావురాల గుట్టలో పావురం అయ్యాడు అని ఎలా అన్నావు.. కాంగ్రెస్ ప్రభుత్వ జలయజ్ఞాన్ని ధనయజ్ఞమని నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డిని పట్టుకొని క్విడ్ ప్రోకో కింద లక్ష కోట్ల అవినీతి చేశాడని చెప్పింది నువ్వే కదా.. కాంగ్రెస్ పాలనలో తన తండ్రి చనిపోతే దహన సంస్కారాల అనంతరం స్నానానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని చెప్పుకున్న మనిషి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో 6 గంటల కరెంటు రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటల కరెంటు ఇచ్చారు. 24 గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి తినే కంచంలో ఉమ్మిచ్చే రకం.. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయంలో కూర్చునేది నువ్వే కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ ద్వారా మూసీకి తెస్తానని చెప్పింది నువ్వే కదా. అప్పులపై పూటకో మాట, చిల్లర మాటలు తప్ప రేవంత్ రెడ్డి చెప్పేది ఏం లేదు. కేసీఆర్ పాలనలో మొత్తం చేసిన అప్పులు 2,80,000 కోట్లు అని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం.. 11 ఆగస్టు 2025 న బీజేపీ ఎంపీ రఘునందన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది. తెలంగాణ అప్పులపై అడిగింది బీజేపీ ఎంపీ, చెప్పింది కేంద్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ టాక్స్ ఓన్ రెవిన్యూ ఆవరేజ్ గ్రోత్ రేట్ 15 శాతం. సెప్టెంబర్ 2025లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్‌లో జీఎస్టీ వృద్ధిరేటులో తెలంగాణ సాధించిన వృద్ధిరేటు 5 శాతం. దేశంలో చివరి స్థానంలో తెలంగాణ ఉంది. సెప్టెంబర్ 2024లో +1 తెలంగాణ వృద్ధిరేటు +1 శాతం. సెప్టెంబర్ 2023లో +33 తో తెలంగాణ వృద్ధిరేటు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఎందుకు తెలంగాణ రాష్ట్రం వృద్ధిలో తిరోగమనం పడుతుంది. రేవంత్ రెడ్డి వసూళ్ల వల్ల, కమీషన్ల వల్ల జీఎస్టీ తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. రోడ్ టాక్స్ తగ్గింది. కేసీఆర్ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,000కు పెరిగింది. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 2014లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ 62,000 కోట్లు. 2023లో 2,30,000 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.