Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలన పంచతంత్రంలో నీలిరంగు పూసుకున్న నక్క లాంటిది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. పది సంవత్సరాలు పరుగులు తీసిన ప్రగతి రథానికి రేవంత్ మార్క్ ప్రజాపాలన స్పీడ్ బ్రేకర్‌గా మారిందని ధ్వజమెత్తారు. టాప్ గేర్‌లో పరుగులు పెడుతున్న రాష్ట్రం క్రమక్రమంగా రివర్స్ గేర్‌లో పడే ప్రమాదం క్లియర్‌గా కనిపిస్తున్నది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
ఈసారి బడ్జెట్ లో ఆరుగ్యారంటీలలోని కీలక అంశాలపై మీరు ప్రతిపాదనలు కూడా పెట్టలేదంటేనే మీలో ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందని చెప్పకనే చెప్పారు. రాజ్యం అసమర్థమైనదిగా మారినప్పుడు ప్రజలపై అణచివేత ప్రయోగిస్తుంది. కనుక రాబోయే రోజుల్లో ప్రజలకు లభించేవి ముఖ్యమంత్రి తిట్లు, పోలీసుల నుండి కొట్లు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంక్షేమాన్ని అభివృద్ధిని చవి చూస్తుంటే మీరు వచ్చి లేని ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాట గలిపారు. వైకుంఠపాళిలో పెద్ద పాము మింగినట్టు అయింది. మీ మార్పేమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పేమిటో ఓట్ల రూపంలో తెలియడానికి కొంత కాలం మిగిలి ఉందని హరీశ్‌రావు అన్నారు.
బడ్జెట్‌పై తన వాదనను ముగించే క్రమంలో చివరగా.. పంచతంత్రంలో చిన్నయసూరి చెప్పిన నీలిరంగు నక్క కథను హరీశ్‌రావు చెప్పారు. ఒక నక్క ఆహారాన్ని వెతుక్కుంటూ ఊర్లోకి వచ్చిందట. అక్కడ రజకులు బట్టలకు వాడే నీలిరంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. దీంతో ఆ నక్క ఒంటి నిండా నీలిరంగు అంటుకున్నది. ఆ తర్వాత అది మళ్లీ అడవిలోకి పోయింది. నీలిరంగు నక్కను చూసి ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న మిగిలిన జంతువులన్నీ భయపడ్డయి. ఇదేదో బాగుంది అనుకున్న నక్క… నేను దేవుడు పంపిన దూతను, ఈరోజు నుంచీ నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క ఎన్ని కష్టాలు పెట్టినా భరించాయి. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది. కొత్త చట్టాల గురించి చెబుతున్నది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క ఒంటికి అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజ స్వరూపం బయటపడింది. మాయమాటలతో, మారు వేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలం నిలవవు అన్నది ఈ నీలిరంగు నక్క కథలోనీతి సూత్రం అధ్యక్షా.. ఈ కథలోలాగానే ఈ కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు ఎక్కువకాలం నిలవవు. వీళ్ల మాయమాటలు, కుటిల నీతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్ధమైపోయింది. జై తెలంగాణ… జై కేసీఆర్… అని నినదిస్తూ హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు.
కాంగ్రెస్ పాలన పంచతంత్రంలో నీలిరంగు పూసుకున్న నక్క లాంటిది – హరీష్ రావు pic.twitter.com/7Z2NFcXgr8
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2025