Harish Rao | హైదరాబాద్ : జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఉపాధి హమీ ఏపీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. చేసిన పనికి వేతనాలు రాక ఉపాధి హమీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమై సతమతమవుతుంటే ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గం అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మరోవైపు పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు రాక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎన్నికల సమయంలో హామీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి హామీ ఏపీవోలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కమ్మగాని శ్రీనివాస్ (48) దేవరుప్పుల మండలంలో ఉపాధి హామీ ఏపీవోగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం శ్రీనివాస్ మార్నింగ్ వాక్కు వెళ్లగా, దేవరుప్పులలోని జనగామ రోడ్డులో గల ఓ మోటర్ వెహికిల్ షోరూం వద్ద గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పని ఒత్తిడితోపాటు మూడు నెలలుగా జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఏపీవో మృతి చెందాడని ఆరోపిస్తూ ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రావు మాట్లాడుతూ ఉపాధి హామీ సిబ్బందిపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు.