పిల్లలకు పురుగుల అన్నం, విషాహారం తినిపించడంతో దవాఖానల పాలవుతున్నారు. 11 నెలల్లో 42 మంది పిల్లలు చనిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే రేవంత్‌రెడ్డి నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని విధాలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా.. రైతులు, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మేం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటాం.
– హరీశ్‌రావు
Harish Rao | సంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ‘రంగనాయక్ సాగర్‌లో గుంట ప్రభుత్వభూమిని గాని, ఇరిగేషన్ భూమిని గాని నేను కబ్జా చేయలేదు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి 13 ఎకరాల పట్టాభూమి కొన్న. అంతే తప్ప గుంట ప్రభుత్వభూమి కూడా తీసుకోలేదు. తీసుకునే ఆలోచన కూడా నాకు లేదు, రాదు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘రైతులు ఏ భూమి అమ్మారో, ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారమే నేను కబ్జాలో ఉన్నా.. గుంట భూమి కూడా ఎక్కువలేదు’ అని తేల్చిచెప్పారు. ‘నాపై కబ్జా ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రంగనాయక్ సాగర్ రావాలి. రేవంత్‌రెడ్డి సమక్షంలోనే నా భూమి సర్వే చేయిద్దాం. నేను అక్కడే ఉంటా.. రేవంత్‌రెడ్డీ.. రంగనాయక్ సాగర్ ఎప్పుడు వస్తావో చెప్పు’ అని సవాల్ చేశారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలంలోని మనసాన్పల్లిలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగనాయక్ సాగర్‌లో ఇరిగేషన్ భూమిని కబ్జా చేశానని తనపై రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. కబ్జాల చరిత్ర రేవంత్‌రెడ్డికి ఉన్నదని ధ్వజమెత్తారు.
రంగనాయక్ సాగర్ దగ్గర రైతుల పట్టా పాస్‌పుస్తకాలు తీసుకుని, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లి 13 ఎకరాల పట్టా భూమిని నిబంధనల మేరకు తాను కొనుగోలు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్నందుకు తనను రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుణమాఫీ అమలులో సర్కార్ విఫలమైందని, పిల్లలకు పురుగుల అన్నం, విషాహారం తినిపించటంతో దవాఖానల పాలవుతున్నారని రేవంత్‌రెడ్డిని నిలదీశానని, రేవంత్ అధికారంలోకి వచ్చాక 42 మంది పిల్లలు చనిపోయారని కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. తమను ఎన్ని విధాలుగా
బ్లాక్మెయిల్ చేసినా.. రైతులు, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.
ధాన్యం దళారుల పాలు
ధాన్యం సేకరణలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని హరీశ్ విమర్శించారు. కనీసం వడ్లయినా కొనుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తారని ఆశించిన రైతులకు ఈ ప్రభుత్వంలో భంగపాటే మిగిలిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కొనుగోళ్లు జరగక రైతులు రూ.500 తక్కువకు దళారులకు వడ్లు అమ్ముకుంటున్నారని వాపోయారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని మంత్రి ఉత్తమ్ చెప్పగా పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ 70 లక్షలే కొంటామని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ధాన్యం ప్రభుత్వం కొనే పరిస్థితిలేదని తెలిపారు. ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించినా రైతులు ప్రస్తుతం రూ.500 తక్కువ ధరకే ధాన్యం అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీలకు ఆసైన్డ్భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని, కానీ ఎస్సీ, ఎస్టీల భూములను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతున్నదని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మఠంభిక్షపతి, జైపాల్‌రెడ్డి, పట్నం మాణిక్యం, సాయికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.