Harish Rao | హైదరాబాద్ : గోదావరి నదిపై ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగానే.. కాళేశ్వరంను నిర్మించిన కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడారు.
బిట్రీష్ కాలంలో సర్ ఆర్ధర్ కాటన్.. ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని కష్టపడి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించారు సర్ ఆర్ధర్ కాటన్. ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు. ఆ రోజుల్లోనే బ్రిటీష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా హెమ్మింగ్టన్ కమీషన్ వేశారు. బ్యారేజీ కట్టి నీళ్లు ఇచ్చిన కాటన్‌ను 900 ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది. కానీ ఏం జరిగింది చివరకు.. ఇప్పటీకీ కూడా సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు. ఆయనను ఇప్పటికీ కూడా దేవుడిలా కొలుస్తుంటారు. డెఫినెట్‌గా కేసీఆర్ కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. ముమ్ముటికీ తెలంగాణకు కాళేశ్వరం వర ప్రదాయిని, తెలంగాణ భవిష్యత్‌కు కాళేశ్వరం గుండెకాయ లాంటిది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ భవిష్యత్‌కు కాళేశ్వరం గుండెకాయ లాంటిది. ఆఫ్ కోర్స్ ఈ విషయం సీఎంకు కూడా తెలుసు. ఎందుకంటే కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాకు పోయి గంధమల్లకు కొబ్బరికాయ కొట్టింది ఆయన్నే. కాళేశ్వరం నీళ్లే గంధమల్ల ప్రాజెక్టుకు పోతాయి. మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశాడు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరం కూలిందని అబద్దపు మాటలు చెప్పి.. గందమల్లకు కొబ్బరికాయలు కొట్టి, మల్లన్నసాగర్‌కు టెండర్లు ఎలా ఖరారు చేస్తావ్ బిడ్డా రేవంత్ రెడ్డి. కేసీఆర్ వందేళ్ల రాష్ట్ర భవిష్యత్ కోసం కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించారని హరీశ్‌రావు తెలిపారు.